టాప్ స్టోరి : ర‌జ‌నీ హిమాల‌యాల‌కు వెళ్లే స‌మ‌యం?!

Thursday, October 26th, 2017, 01:02:50 PM IST

ఇన్నాళ్లు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాల‌కు మాత్ర‌మే అంకితం. ఇక సినిమాలు వ‌దిలి రాజ‌కీయాల్లో తాడో పేడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగుతున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ర‌జ‌నీకాంత్ తొంద‌ర్లోనే పార్టీ పెట్టి, త‌మిళ రాజ‌కీయాల అంతు చూసేందుకు రెడీ అవుతున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మైంది. ర‌జ‌నీ పెట్ట‌బోయే పార్టీ ఏది? ఆ పార్టీ సింబ‌ల్ ఏంటి? పాల‌సీ ఏంటి? అన్న క్యూరియాసిటీ అభిమానుల్లో ఉంది. అంతేకాదు .. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో అంతుచిక్క‌ని శూన్య‌త రాజ్య‌మేలుతోంది. అస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతోంది. ఇలాంటి వేళ ర‌జ‌నీకాంత్ తానే నేరుగా బ‌రిలోకి దిగి సీఎం అయితే ఎలా ఉంటుంది? అని ఆలోచించారు. అందుకే ఇక ర‌ణ‌రంగంలోకి దూకేస్తున్నార‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఆ మేర‌కు ద్ర‌విడ పార్టీల‌న్నీ ర‌జనీ రాక త‌మ పుట్టి ముంచుతుంద‌ని బెంబేలెత్తుతున్నాయి.

అయితే ఇదంతా ఓ కోణం మాత్ర‌మే. మ‌రో ఆస‌క్తిక‌ర కోణాన్ని ర‌జ‌నీ యాంగిల్‌లో ప‌రిశీలించాల్సి ఉంటుంది. ఇటీవ‌లి కాలంలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర‌చూ అనారోగ్యానికి గుర‌వుతున్నారు. రోబో 2 చిత్రీక‌ర‌ణ ఆరంభంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి తలెత్తి అమెరికా వెళ్లి చికిత్స తీసుకోవాల్సొచ్చింది. క‌బాలి రిలీజ్ వేళ ఇది ఎంతో ఇబ్బంది పెట్టింది. అంటే వ‌య‌సు మీద ప‌డిన కొద్దీ ర‌జ‌నీకి ఇది ప‌దే ప‌దే రిపీట‌య్యే స‌మ‌స్య‌. అయినా ఆరుప‌దుల వ‌య‌సులోనూ ర‌జ‌నీ ఇంకా చెలాకీగానే సినిమాల్లో న‌టిస్తూ త‌న‌కి ఇంకా వ‌య‌సైపోలేద‌ని నిరూపించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీ న‌టిస్తున్న‌ కాలా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. త‌దుప‌రి 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ర‌జ‌నీ రాజ‌కీయారంగేట్రం ఉంటుందిట‌. అయితే రాజ‌కీయాలంటే ఏసీ కార్ల‌లో తిరుగుతూ మేక‌ప్ వేసుకున్నంత వీజీ కాదు. ఎండా కొండా, వాన‌-వ‌ర‌ద‌ అనే తేడా లేకుండా నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్య తిర‌గాలి. ప్ర‌జాసేవ‌లో నిమ‌గ్నం కావాలి. అలా చేస్తే ర‌జ‌నీ ఆరోగ్యం ఏం కాను? అంతంత మాత్రంగానే ఉన్న త‌న స‌న్నివేశం తిర‌గ‌బెడితే.. క‌ష్ట‌మే. ఇక ఈ వ‌య‌సులో ర‌జ‌నీ హిమాల‌యాల్లో ప్ర‌శాంత చిత్తుడై ఆరోగ్యంగా .. ఆహ్ల‌దంగా ప్ర‌శాంత జీవ‌నాన్ని గ‌డ‌పాల‌ని అనుకోవ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. వాస్త‌వానికి అత‌డు బాబా సినిమా టైమ్‌లోనే ఆ ప‌ని చేసేందుకు ఉద్యుక్తుల‌య్యారు. కానీ ప‌రిస్థితులు సినిమాల్లో న‌టించేలా చేశాయి. కొన్ని క‌మిట్‌మెంట్‌లు, ఊహించ‌ని ఫైనాన్సియ‌ల్ ఇష్యూస్ అత‌డికి రెస్ట్ అనేదే లేకుండా చేశాయి. అయితే జ‌రుగుతున్న ప‌రిణామాల దృష్ట్యా ర‌జ‌నీ మునుముందు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? అన్న‌ది ఊహించ‌లేనిది. అత‌డు రావ‌ణ కాష్టం లాంటి రాజ‌కీయాల్లో ఎదురెళ్లి పోరాడ‌తారా? లేక హిమాల‌యాల దారి వెతుక్కుంటారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. చూద్దాం.. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెబుతుంది. అన్న‌ట్టు ర‌జ‌నీ ఇటీవ‌లే స్నేహితుల‌తో క‌లిసి హిమాల‌యాల్లో నిర్మించిన ధ్యాన‌మందిరం కం ఆశ్ర‌మం వెబ్‌లో వైర‌ల్ అయ్యింది. ర‌జ‌నీ ఇదివ‌ర‌కూ ధ్యానం చేసుకున్న స్థ‌లానికి చాలా చేరువ‌లోనే ఈ ఆశ్ర‌మాన్ని కోటి రూపాయ‌ల‌తో నిర్మించారుట‌.