హృతిక్ తో బాక్సాఫీస్ యుద్దానికి సై అంటున్న రజిని?

Wednesday, June 13th, 2018, 01:08:16 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల విడుదలయిన చిత్రం కాలా. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర తన ప్రభావాన్ని చూపలేక చతికలపడింది. ఇప్పటికే దాదాపుగా విడుదలయిన అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు విశ్లేషకులు. కొందరైతే కాలా కంటే కబాలి నే బెటర్ అని అంటున్నారు. ఇక రజిని అభిమానులందరూ కాలా నిరుత్సాహపరచడంతో ఆయన తదుపరి శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 2.0 పైనే ఆశలు పెట్టుకున్నారు. 2015లో ఆరంభమయిన ఈ చిత్రం షూటింగ్ ఇంకా జరుగుతూనే వుంది. తొలుత ఈ చిత్రాన్ని 2017దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే అది కుదరక తరువాత 2018 జనవరికి వాయిదా వేశారు. ఇక అదికూడా కాదు మొన్న వేసవికి అన్నారు, అదీ లేదు ఇక దీపావళికి పక్కాగా విడుదల చేస్తున్నామని, సినిమాలో గ్రాఫిక్స్ కు అధిక ప్రాధాన్యం ఉండడంతో చిత్రం పూర్తికావడం ఆలస్యం అవుతోంది అని దర్శకుడు శంకర్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అయితే మళ్ళి ఇప్పుడు దీపావళి కూడా ఈ చిత్రం విడుదల కావడం కష్టమని, రానున్న 2019 రిపబ్లిక్ డే రోజుకి విడుదల తేదీ మారిందని కొత్తగా సమాచారం అందుతోంది.

ఇక్కడే ఒక చిన్న చిక్కు వుంది, హృతిక్ రోషన్ ప్రస్తుతం బీహార్ గణిత అధ్యాపకుడు ఆనంద్ కుమార్ జీవిత గాధ ఆధారంగా నటిస్తున్న బయోపిక్ ‘సూపర్ 30’ రిపబ్లిక్ డే సమయంలో విడుదలకు ఆ చిత్ర యూనిట్ ముహూర్తం నిర్ణయించింది. ఇదివరకు హృతిక్ నటించిన అగ్నీపథ్, కాబిల్ చిత్రాలు ఇదే సమయంలో విడుదలయి మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ సెంటిమెంట్ ప్రకారం సూపర్ 30ని కూడా అదే సమయంలో విడుదలచేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అయితే ఇప్పుడు రోబో కూడా అదే సమయానికి మారుతుండడంతో ఇద్దరికీ థియేటర్ల సమస్య రావడం ఖాయమని, అంతే కాక ఏ ఒక్క చిత్రం విజయం సాధించి మరొకటి అపజయం పాలైతే వచ్చే నష్టం భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి 2.0 చిత్రం విడుదల తేదీ వాయిదా పడడంపై ఇంకా అధికారిక ప్రకటన ఏమి రాలేదని, ఆ చిత్ర యూనిట్ సభ్యులు తేదీని ప్రకటిస్తేనే గాని ఈ పుకార్లకు తెరపడదని సినీ విశ్లేషకులు అంటున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments