త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్న రజిని ?

Tuesday, January 16th, 2018, 06:12:09 PM IST

సూపర్ స్టార్ రజినికాంత్ పేరు తమిళనాటనే కాదు దాదాపు గా దేశవ్యాప్తంగా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు అని చెప్పవచ్చు. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన గత నెల డిసెంబర్ 31 అర్ధ రాత్రి పార్టీ ప్రకటన విషమై త్వరలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన విషయం అందరికి విదితమే. అయితే ఇక్కడ జనసేన పార్టీ ని స్థాపించిన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకలాపాలు ఒక్కొక్కటిగా మెల్లగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఆయన ప్రస్త్తుతం సినిమాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన సినిమాలు కూడా చేయడం వలన పార్టీ కార్యకలాపాలకు కొంత మేర విఘాతం కలుగుతోందని, రజిని అలా కాకుండా ప్రస్తుతం ఆయన చేతిలో వున్న 2.0, కాలా చిత్రాల తర్వాత తన సినిమా జీవితానికి ముగింపు పలకనున్నారని సమాచారం.

ప్రస్తుతం తన పార్టీ కి సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రాంభించిన ఆయన మొదటి దశ సభ్యత్వ నమోదు పూర్తికాగానే పార్టీ పేరు, జెండా, ఎజెండా, ఆఫీస్ బేరర్ల విధానాల్ని ఒక వేదిక పై ప్రకటించనున్నట్లు, అలాగే తను నటిస్తున్న ‘కాలా’ నే తన చివరి చిత్రంగా ఒక ప్రకటన కూడా చేయనున్నట్లు చెపుతున్నారు. పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటించిన వెంటనే ఆయన తమిళనాడు లోని ముఖ్య ప్రాంతాల్లో పర్యటన కూడా చేయదలిచారట. అలానే ఎన్నికల సమయంలో కూడా మరొక సారి పర్యటన ఉంటుందని సమాచారం. అయితే తమిళనాడు లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీచేస్తుందని ఆయన ఇదివరకు చెప్పిన విషయం మనకు విదితమే…