సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, సెన్సషనల్ దర్శకులు శంకర్ దర్శకత్వం లో చేస్తున్న సినిమా 2.0. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల, దానికి సంబందించిన సిజి వర్క్ పూర్తి అవడానికి ఇంకొద్ది కాలం పడుతుందని, అందువల్ల సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు దర్శకులు శంకర్ ఇటీవల స్పష్టం చేసారు. అయితే అనూహ్యంగా రజిని నటిస్తున్న మరొక సినిమా కాలా ఈ వేసవి బరిలో నిలిచింది. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 27 న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
ఈ సినిమాకి కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబదించిన ఒక న్యూస్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇప్పటికే బిజినెస్ పరంగా పలు సంచలనాలు నమోదు చేస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయం లో మరొక అద్భుత రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. దాదాపు 75 కోట్లకు స్టార్ సంస్థ ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్‌ను సొంతం చేసుకుందట. దీంతో శాటిలైట్ రైట్స్ రూపంలో అత్యధిక మొత్తం సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది ఈ సినిమా.
అంతేకాదు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దంగల్ సినిమా రైట్స్ కూడా ఇదే మొత్తానికి అమ్ముడవ్వటం విశేషం. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న 2.0, సంచలన విజయం సాధించిన బాహుబలి 2 చిత్రాలు మాత్రమే ఈ లిస్ట్‌లో కాలా కన్నా ముందున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్ కరికాలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ప్రతీనాయకుడిగా నటిస్తుండగా హ్యూమా ఖురేష్ రజనీకాంత్ కి జోడిగా నటిస్తోంది. రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విడుదలకు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు సృష్టించనుందో…