జనసేనపై రవితేజ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో పవన్ కళ్యాణ్..!

Saturday, December 14th, 2019, 07:20:51 PM IST

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై రాజు రవితేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ పట్ల ఆయన అభిప్రాయాలను, ఆవేదనను గౌరవిస్తూ ఆయన రాజీనామాను పవన్ కళ్యాణ్ నిన్న అధికారికంగా ఆమోదించారు. అయితే గతంలో కూడా ఇలాంటి ఆవేదనతోనే పార్టీనీ వీడిన రాజు రవితేజ కొద్ది రోజుల తరువాత మళ్ళీ పార్టీలో చేరారు.

అయితే నేడు మీడియాతో మాట్లాడిన రాజు రవితేజ ఏ సిద్ధాంతాలతో అయితే జనసేనను స్థాపించామో, ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వ్యవరిస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ను ప్రతిపక్ష నేతల కంటే సొంత పార్టీ నేతలే ఎక్కువగా విమర్శిస్తారని అన్నారు. ఎన్నికలలో ఓడిపోయాక పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంలో మార్పు వచ్చిందని, రాజకీయ లబ్ధీ కోసం కులాల, మతాల ప్రస్తావనను తీసుకువస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పవన్‌కు ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకోరని, వారిని పక్కన పెట్టేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఉండాలని పవన్ ఆలోచిస్తున్నారని అందుకే తాను పార్టీనీ వీడానని అన్నారు. భవిష్యత్తులో ఇక తాను ఏ పార్టీలో చేరనని రాజు రవితేజ స్పష్టం చేశారు.