రామ్‌చ‌ర‌ణ్ – దుల్కార్ మ‌ల్టీస్టార‌ర్‌?

Friday, May 18th, 2018, 02:09:08 AM IST

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌- మాలీవుడ్ మెగా వార‌సుడు దుల్కార్ స‌ల్మాన్ క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌నున్నారా? అంటే అవున‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం దృష్ట్యా సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే అలాంటి ఓ స్క్రిప్టు వ‌స్తే వర్క‌వుట్ అవుతుంద‌ని చెబుతున్నారు. దుల్కార్ ఎప్పుడు హైద‌రాబాద్‌లో అడుగుపెట్టినా ఇక్క‌డ చ‌ర‌ణ్‌ని క‌లుస్తుంటాడు. అలానే కేర‌ళ‌లో అడుగుపెట్ట‌గానే చ‌ర‌ణ్‌ని దుల్కార్ రిసీవ్ చేసుకుంటాడు. ఫంక్ష‌న్లు, స‌క్సెస్‌మీట్ల‌లో క‌లుసుకోవ‌డం అన్న‌ది ఎప్పుడూ ఉన్న‌దే. అంత‌టి సాన్నిహిత్యం ఉంది కాబ‌ట్టే.. ఆ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తే చూడాల‌న్న‌ది మెగాభిమానుల కోరిక‌. అయితే ఆ కోరిక ఫ‌లించేందుకు ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని అంటున్నారు.

ఇప్ప‌టికైతే ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీ. రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి సినిమా చేస్తూనే, రాజ‌మౌళితో మ‌ల్టీస్టార‌ర్ కోసం రెడీ అవుతున్నాడు. తార‌క్‌తో క‌లిసి న‌టిస్తాడు. ఇక దుల్కార్ స‌ల్మాన్ న‌టించిన `మ‌హాన‌టి` ఇటు తెలుగులో, అటు త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఇందులో అత‌డు జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో న‌టించాడు. ఇక త‌దుప‌రి ప‌లు క్రేజీ ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. ఇవ‌న్నీ పూర్తి చేసుకుని ఆ ఇద్ద‌రూ క‌లిసేస‌రికి కాస్తంత స‌మ‌యం ప‌ట్టొచ్చు. ఇక కెరీర్ ప‌రంగా చూస్తే, చ‌ర‌ణ్ ఇప్పుడిప్పుడే ఇరుగుపొరుగు భాష‌ల్లో మైలేజ్ పెంచుకునే ప‌నిలో ఉన్నాడు. ఆ క్ర‌మంలోనే దుల్కార్‌తో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తే, అది అత‌డి మ‌ల‌యాళ బిజినెస్‌కి క‌లిసొస్తుంద‌ని విశ్లేషిస్తున్నారు. చూద్దాం.. ఆ రోజు సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే రావాల‌ని ఆశిద్దాం.