మమ్ముట్టికి వర్మ అక్షింతలు!

Wednesday, April 22nd, 2015, 07:57:29 PM IST


ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మలయాళం నటుడు మమ్ముట్టి నటనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఇటీవల విడుదలైన ‘ఓకే బంగారం’ సినిమాలో మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ నటనను ప్రశంసించే క్రమంలో వర్మ మమ్ముట్టిపై ధ్వజమెత్తాడు. అలాగే సల్మాన్ నటనను ప్రశంసించేందుకు ట్విట్టర్ ను వేదికగా తీసుకున్న వర్మ పనిలోపనిగా మమ్ముట్టిపై విమర్శల వర్షం కురిపించారు.

ఇక వర్మ తన ట్విట్టర్ లో ఇప్పుడే మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఒకే బంగారం’ సినిమా చూశానని, కేరళ అవార్డు కమిటీ సభ్యులకు ఏమాత్రం సెన్స్ ఉన్నా మమ్ముట్టికి ఇచ్చిన అవార్డులను వెనక్కు తీసుకుని వాటిని దుల్కర్ కు ఇవ్వాలని సూచించారు. అలాగే మమ్ముట్టి నటనను తన కొడుకు నుండి నేర్చుకోవాలని వర్మ సూచించారు. ఇక దుల్కర్ తో పోలిస్తే మమ్ముట్టి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తో సమానమని, కొన్నేళ్లలో మమ్ముట్టి సాధించలేని దాన్ని దుల్కర్ సాధించి కేరళ గర్వపడేలా చేస్తాడని వర్మ ట్వీట్ చేశారు. కాగా ఒకరిని పోగిడేందుకు మరొకరిని తిట్టే లక్షణం ఉన్న వర్మ ఇటీవల టెంపర్ సినిమా చూసి సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ ఎన్టీఆరే గొప్ప అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.