లేటెస్ట్ : ‘జేజమ్మ’ రికార్డును బ్రేక్ చేసిన ‘రామలక్ష్మి’

Wednesday, April 4th, 2018, 12:12:33 AM IST


మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత అక్కినేని సూపర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన రంగస్థలం చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది. ఈ చిత్రంలో నటించిన నటీనటుల ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. చిట్టిబాబుగా రాంచరణ్‌తో రామలక్ష్మీగా నటించిన సమంతకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత అతివేగంగా 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా రంగస్థలం ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ నేపథ్యంలో సమంత ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నారు. అత్యధికంగా వంద కోట్ల క్లబ్‌లో చేరినట్టు అనుష్క పేరిట ఉన్న రికార్డును రామలక్ష్మీ తిరగరాసింది. కాగా రంగస్థలం కలెక్షన్ల సునామీకి బాలీవుడ్ చిత్రం భాగీ2 కూడా చిన్నబోయింది.

కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికాలో అత్యధికంగా వసూలు చేస్తున్న టాప్ 10 చిత్రాల జాబితాలోకి రంగస్థలం చేరింది. ఇదిలా ఉండగా, సమంతకు తన కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన 8వ చిత్రం రంగస్థలం కావడం విశేషం. ఈ ఏడాది రంగస్థలం సినిమా ద్వారా సమంత 100 కోట్ల క్లబ్‌లో మరోసారి చేరింది. రంగస్థలం సినిమా సమంత కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన 8వ చిత్రం అంటూ ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు
సమంత నటించిన చిత్రాల్లో వంద కోట్ల చేరిన చిత్రాల్లో మెర్సల్, తెరీ, కత్తి, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది, దూకుడు, 24 సినిమాలు ఉన్నాయి.

తాజాగా విడుదలైన రంగస్థలం సినిమా కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరింది. దాంతో వందల కోట్ల రారాణిగా కీర్తించబడుతున్నది. గతంలో అత్యధికంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన హీరోయిన్‌గా అనుష్క శెట్టి పేరు మీద ఓ రికార్డు ఉంది. ఆ రికార్డును గతంలోనే సమంత తిరుగారాసినప్పటికీ. తాజాగా రంగస్థలం సినిమాతో మరో మెట్టు ఎగబాకింది. ఈ విధంగా చూస్తే జేజమ్మ రికార్డుకు రామలక్ష్మి ఎసరు పెట్టినట్లేగా మరి…..