1 నుండి ఆ రెండు బ్యాంకింగ్ సేవలు ఉచితమే..ఆర్‌బీఐ సంచలన నిర్ణయం

Wednesday, June 12th, 2019, 04:04:53 PM IST

దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచటానికి రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకి వెళ్తుంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌(ఆర్‌టీజీఎస్‌)’, ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(నెఫ్ట్‌)’ ద్వారా ఆన్లైన్ లో జరిపే లావాదేవీలపై జులై 1 నుండి ఎలాంటి చార్జెస్ తీసుకోవటం లేదని, ఈ సేవలు ఇక ఉచితంగా వాడుకోవచ్చని తెలిపింది..నిజానికి ఆర్‌టీజీఎస్‌ కావచ్చు,నెఫ్ట్ కావచ్చు ఈ సేవలు మనం ఉపయోగించుకుంటే బ్యాంకులు మన దగ్గర నుండి చార్జెస్ తీసుకోని ఆర్‌బీఐ కి చెల్లిస్తుంది..

అధిక మొత్తంలో నగదు బదిలీ చేయాలంటే ఆర్‌టీజీఎస్‌ ఉపయోగిస్తారు,రెండు లక్షల లోపు నగదు బదిలీ చేసేందుకు నెఫ్ట్ ని ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఆర్‌బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వలన ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, నగదు చలామణి తగ్గించడం, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడం వంటి విషయంలో పెద్ద ముందడుగు పడినట్లేనని భావించవచ్చు.ఆర్‌బీఐ తీసుకున్న ఈనిర్ణయం పట్ల వివిధ రకాల వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతంస్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నెఫ్ట్‌ లావాదేవీలకు రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలకు రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది. మిగిలిన కొన్ని బ్యాంకు లు ఆర్‌టీజీఎస్‌ కి 2 లక్షల నుండి 5 లక్షల మధ్య లావాదేవీలకు 30 రూపాయలు. ఆపైన జరిగే లావాదేవీలకు 55 రూపాయలు వసూళ్లు చేస్తున్నాయి..