గొడ‌వ‌ల్లో ప‌డి న‌లిగిపోయిన గ్రేట్ మూవీ?

Tuesday, April 10th, 2018, 10:09:48 PM IST

హాలీవుడ్ సినిమాలు భార‌త‌దేశంలో రిలీజై సంచ‌ల‌న వ‌సూళ్లు సాధిస్తున్నాయి. ఇటీవ‌లే రిలీజైన బ్లాక్ పాంథ‌ర్ -3డి కేవ‌లం మెట్రో న‌గ‌రాల నుంచే కోట్ల‌కు కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక ఇదే హుషారులు ప‌లు హాలీవుడ్ చిత్రాలు రిలీజ్ బ‌రిలో దిగుతున్నాయి. అయితే ఇటీవ‌లే రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన `రెడీ వ‌న్ ప్లేయ‌ర్‌` ఇండియాలో రిలీజ్ కాక‌పోవ‌డం వెన‌క కార‌ణం ఏంటో ఇన్నాళ్లు తెలియరాలేదు. ట్రైల‌ర్ వీక్షించిన ఎంతోమంది స్పీల్‌బ‌ర్గ్ ఫ్యాన్స్ మూవీ రిలీజ్ కాక‌పోవ‌డంతో తీవ్రంగా నిరాశ‌ప‌డ్డారు. స్పీల్ బ‌ర్గ్ అంత‌టి మేధావి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాని వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ అంత‌టి ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ నిర్మించింది. అయినా ఇండియాలో రిలీజ్ కాక‌పోవ‌డంపై సందేహం నెల‌కొంది.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ఈ సినిమా ఇండియా రిలీజ్ కొన్ని వివాదాల వ‌ల్ల ఆగిపోయింద‌ని తెలిసింది. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూట‌ర్లు .. థియేట‌ర్ ఓన‌ర్ల‌కు టిక్కెట్ ఛార్జీపై సర్వీస్ ఛార్జీల్లో షేర్ ఇవ్వ‌న‌ని మొండికేయ‌డంతో రిలీజ్ ఆగిపోయిందిట‌. మొత్తానికి ఈ సినిమా ఇండియా రిలీజ్ ఆగిపోవ‌డం వ‌ల్ల దాదాపు 500 కోట్ల మేర న‌ష్టం వాటిల్లిన‌ట్టేన‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇదే సినిమా చైనాలో రిలీజై ఇప్ప‌టికే 1050 కోట్లు (163కోట్లు) వ‌సూలు చేసింది. అక్క‌డ అంత పెద్ద విజ‌యం సాధించినందుకు, ఇండియాలో స‌జావుగా రిలీజై ఉంటే అందులో స‌గం వ‌సూలు చేసినా గొప్ప ఫ‌లితం అందుకున్న‌ట్టే. అయితే ఇప్పుడు అందుకు ఆస్కారం ఉందో లేదో చెప్ప‌లేం. ఇంకా ఈ గొడ‌వ‌లు స‌ద్ధుమ‌ణ‌గ‌క ముందే ఇండియాలోని ప‌లు న‌గ‌రాల్లో రిలీజైందని తెలుస్తోంది. దిల్లీ, నోయిడా, ముంబై, అహ్మ‌దాబాద్‌, పూణే, గుర్‌గావ్ వంటి చోట్ల ఈ సినిమా రిలీజైంది కానీ, హైద‌రాబాద్‌లో మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. ఏదేమైనా వాయిదా ప్ర‌భావం ఈ సినిమాపై ఉంటుంది. పైగా ఇలాంటి గ్రేట్ సై-ఫై చిత్రానికి చేయాల్సినంత ప‌బ్లిసిటీ ఇండియాలో ఇక ఎలానూ చేయ‌రు కాబ‌ట్టి ఆ మేర‌కు ఒక గొప్ప ద‌ర్శ‌క‌దిగ్గ‌జం సినిమా కిల్ అయిన‌ట్టేన‌ని ట్రేడ్‌లో విశ్లేషిస్తున్నారు.