రాజమౌళితో పోటీ..చిత్తైన శంకర్ ప్లాన్..?

Tuesday, October 31st, 2017, 05:25:02 PM IST

బాహుబలి తరువాత రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ప్రపంచంలోనే పాపులర్ మీడియా సంస్థలన్నీ రాజమౌళి పనితనాన్ని మెచ్చుకున్నాయి. కాగా రాజమౌళి కంటే ముందు దేశవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించిన దర్శకుడు శంకర్. రాజమౌళి కమర్షియల్ చిత్రాల బాట పడితే.. శంకర్ సినిమాల్లో కమర్షియల్ వాల్యూస్ తో పాటుగా దేశభక్తికి సంబందించిన అంశం కూడా ఉంటుంది. శంకర్ చిత్రాలకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. కాగా రోజురోజుకు ఎదుగుతూ శంకర్ హాలీవుడ్ చిత్రాలపై కన్నేశాడనే ప్రచారం కూడా జరిగింది. శంకర్ హాలీవుడ్ ప్రయత్నాలకు ‘ఐ’ చిత్రం బ్రేకులు వేసింది. ఆ చిత్రం పరాజయం కావడంతో మరో సినిమా ద్వారా శంకర్ తన సత్తాని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ లోపు జక్కన్న బాహుబలి చిత్రం ద్వారా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. బాలీవడ్ బడా హీరోలే రాజమౌళితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సహజంగానే శంకర్, రాజమౌళి మధ్య పోటీ ఏర్పడిందనే అభిప్రాయాల వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ సూపర్ స్టార్ రజినీతో 2.0 అనే చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలికి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉండాలని శంకర్ భావిస్తున్నాడట. అందుకోసం అద్భుతమైన గ్రాఫిక్స్ ని ఈ చిత్రంలో చొప్పించాలనే శంకర్ వ్యూహం బెడిసికొట్టినట్లు విడుదలకు ముందే నెగిటివ్ ప్రచారం మొదలైపోయింది. ఇటీవల దుబాయ్ లో ఈ చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరిగింది. మొదట జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కానీ అనూహ్యంగా 2.0 వాయిదా పడింది.

దీనిపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం సినిమాని దెబ్బ తీసే విధంగా ఉంది. 2.0 లో గ్రాఫిక్స్ ఏమాత్రం సంతృప్తి కరంగా లేకపోవడంతో వాటిని సరిచేయాలని శంకర్ భావిస్తున్నాడట. తిరిగి గ్రాఫిక్స్ రూపొందించడానికి ఎక్కువ సమయం కావలసి ఉండడంతో సినిమాని వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర సంగీతం, మరియు పోస్టర్ ల విషయంలో రజినీ అభిమానులే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం పరమ చెత్తగా ఉందని ఫాన్స్ అంటున్నారు. పోస్టర్ లలో అమీజాక్సన్, రజినీ ధరించిన కాస్ట్యూమ్స్ కూడా బాగాలేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంత ప్రతికూల పరిస్థుతుల మద్య శంకర్ ఏం చేస్తాడో చూడాలి.