చంద్రబాబు అలా చేయడానికి అసలు కారణం ఏమై ఉంటుంది..!

Friday, June 14th, 2019, 10:25:27 AM IST

ఏపీలో మొన్నటి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. మొన్నటి సమావేశంలో మొత్తం ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరిగినా నిన్నటి సమావేశంలో మాత్రం చర్చలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే స్పీకర్ ఎంపిక విషయంలో రాజుకున్న నిప్పు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగే వరకు దారి తీసింది. ప్రతి[పక్ష ప్రమేయం ఏమి లేకుండా స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

అయితే సభలో వస్తున్న సంప్రదాయం ప్రకారం స్పీకర్‌గా ఎన్నికైన వారు కుర్చీ అధిష్టించేటప్పుడు అధికార పార్టీ నాయకుడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఇద్దరు కలిసి ఆయనను స్పీకర్‌ను కుర్చీ దగ్గరకు ఆహ్వానించాలి ఇది చట్టసభల్లో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితి. అయితే నిన్న జరిగిన స్పీకర్ ఎంపిక విషయంలో అసహనంగా ఉన్న చంద్రబాబు ప్రొటెం స్పీకర్ పిలిచినా తాను రాలేదు. తమ పార్టీ తరుపున మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడును పంపారు. అయితే చంద్రబాబు వైఖరిని చాలా మంది తప్పు పడుతున్నారు. 2014 లో కూడా ప్రొటెం స్పీకర్ కోడెలను ఆహ్వానించినప్పుడు ఏ విధంగా అయితే అధికార పార్టీ నేతలను, ప్రతిపక్ష పార్టీ నేతలను పిలిచారో ఇప్పుడు కూడా అదే విధంగా పిలిచారు. గతంలో కోడెల విషయంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న జగన్ కోడెలను స్పీకర్ కుర్చీ దగ్గరకు నవ్వుతూ తీసుకెళ్ళి అభినందనలు కూడా తెలిపివచ్చారు. అయితే ఈ ఎన్నికలలో మాత్రం అధికార పార్టీ నాయకుడిగా జగన్ తమ్మినేనిని స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకెళ్తుంటే చంద్రబాబు కనీసం కుర్చీ నుంచి పక్కకి కూడా జరగలేదు. అయితే చంద్రబాబు ఇంతకు ఇలా ఎందుకు చేశాడు అనేదే ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారింది. ఎన్నికలలో ఘొరంగా ఓటమి పాలైనందుకే అలా చేశాడని కొందరు అంటుంటే, లేదు తమతో చర్చించకుండా స్పీకర్ పదవిని తమ్మినేనికి అప్పచెప్పారనే కోపంతో అలా చేశాడని కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రం నా అనుభవం ముందు నేను తమ్మినేనికి స్వాగతం పలకడం ఏమిటి అనే అహం చంద్రబాబుకు అడ్డు వచ్చింది అంటూ పలువురు నేతలు, రాజకీయ వర్గాలు దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుకుంటున్నారట.