ది లీడర్: ఆరు సార్లు కోవూర్ ఎమ్మెల్యేగా అరుదైన రికార్డ్..!

Wednesday, June 12th, 2019, 11:09:39 AM IST

రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. గెలిచిన వారికి ఓటమి తప్పదు.. ఓడిన వారికి గెలుపు తప్పదు అన్నది రాజాకీయాలలో కనిపించే నానుడి. అయితే ఇక్కడ మాత్రం సీన్ కాస్త రివర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓటమి కన్నా గెలుపే వీరిని ఎక్కువ సార్లు వరించింది. కోవూర్ ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నేడు ఆరవసారి అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

అయితే కోవూర్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు వీరి కుటుంబందే ఇక్కడ పైచేయిగా కనిపిస్తుంది. ముందుగా ఇక్కడి నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే తండ్రి మరణం అనంతరం ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి బాటలోనే పయనించారు. పార్టీలకు అతీతంగా వీరు ఏ పార్టీలో ఉన్నా నియోజకవర్గ ప్రజలు మాత్రం వీరి కుటుంబానికే పట్టం కడుతున్నారు. అయితే ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి , ఒకసారి మంత్రిగా కూడా పని చేసారు. ఈ సారి జరిగిన ఎన్నికలలో 39,891 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాదు ఆరోసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతూ కోవూరు నియోజకవర్గ చరిత్రలో తనదైన రికార్డ్‌ను నెలకొల్పాడు. నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కోవూర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు.