అక్కడ కోడి కూత ఉండదు, దాని మాంసము తినరు !

Tuesday, February 27th, 2018, 02:33:30 PM IST

పల్లెటూళ్లలో ఒకప్పుడు వేకువఝామునే లేవాలనుకునేవారు కోడి కూతనే గడియారం గా భావించేవారు. ఆ తరువాత అలారం మ్రోగే గడియారాలు, అదే ప్రస్తుతం అయితే మొబైల్ ఫోన్ ల అలారంలతో నిద్రలేవడం అలవాటు చేసుకున్నాం. అదేవిధంగా ఎటువంటి పండుగ రోజైనా, ఇళ్లకు బంధువులు వచ్చినా కోడి, లేదా వేట మాంసం కూరతో ఆతిథ్యమివ్వడం సాధారణమైంది. అయితే ఈ విధానానికి భిన్నంగా మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుగ్గకాల్వ తండాలో అసుల కోళ్లే ఉండవు.

కోళ్ల పెంపకానికి ఈ తండా గిరిజనులు దూరం. తండాకు చెందిన గిరిజనుల గురువు సోమసాదు ఎటువంటి మామసాహారం భుజించకుండా ఎంతో నిష్ఠగా ఉండేవారట. అలా గత తరాలవారు ఇచ్చిన ఆదేశాలను ఇప్పటి తరం వారు శ్రద్ధగా పాటిస్తూ కోళ్ల పెంపకానికి దూరంగా వుంటున్నారు. బుగ్గకాల్వతండాకు చెందిన గిరిజనులు గత కొన్ని దశాబ్దాలుగా కోళ్లను పెంచడంలేదుసరికదా కోడి, మేక, పొట్టేలు మాంసాన్ని, కోడిగుడ్లు ఇలాంటి మాంసాహారం ముట్టుకోరు, తినరు. వీరి ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినా శాఖాహారంతోనే భోజనం పెడతారు.

వీరు బంధువుల ఇంటికి వెళ్లినా కేవలం శాఖాహారంతోనే భోజనాన్ని ఆరగిస్తారు. తమ చిన్నప్పటి నుంచి తండాలో కోళ్లను చూడలేదని, పూర్వికుల సూచనల అనుసారం తామూ కోళ్లను పెంచడంలేదని అంటున్నారు. మా ముందు తరంవారికీ ఇదే విషయాన్ని సూచిస్తామని అంటున్నారు. పైగా మాంసం తినకపోవడంవల్లనే ఆరోగ్యవంతంగా ఉంటున్నాం అని ఇక్కడి వృద్ధులు చెబుతున్నారు….