రిలీజ్ డైలెమ్మా.. చెర్రీపై తీవ్ర ఒత్తిడి?

Wednesday, May 23rd, 2018, 10:34:36 AM IST

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ రెండు ప‌డ‌వ‌ల ప‌య‌నం గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఓవైపు భారీ చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా న‌టిస్తూనే, మ‌రోవైపు అంత‌కుమించిన భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. ఓవైపు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తూనే, మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా దాదాపు 200కోట్ల బ‌డ్జెట్‌తో `సైరా-న‌ర‌సింహారెడ్డి` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే చెర్రీపై తీవ్ర‌మైన ఒత్తిడి నెల‌కొంద‌ని తెలుస్తోంది. ఇరు ప్రాజెక్టులు త‌న‌కు ఎంతో కీల‌క‌మైన‌వి. ఈ రెండిటి విజ‌యం ఎంతో ఇంపార్టెంట్‌. ఆ క్ర‌మంలోనే రిలీజ్ తేదీల క్లాషెస్ ఊహించ‌ని రీతిలో చ‌ర‌ణ్‌పై ఒత్తిడి పెంచుతోందిట‌.

ఇప్ప‌టివ‌ర‌కూ సైరా న‌రసింహారెడ్డి రిలీజ్ తేదీ విష‌యంలో కానీ, బోయ‌పాటితో త‌న సినిమా రిలీజ్ తేదీ విష‌యంలో కానీ చ‌ర‌ణ్‌కి ఇంకా ఏ క్లారిటీ రాలేదు. అటు సైరా రిలీజ్ తేదీని ఖాయం చేస్తేనే, ఇటు త‌న సినిమా రిలీజ్ తేదీని ఫిక్స్ చేసుకోవాల్సిన స‌న్నివేశం ఉందిట‌. ఆ క్ర‌మంలోనే కాస్త వేచి చూడాల్సిందిగా డి.వి.వి.దాన‌య్య‌ను చ‌ర‌ణ్ అభ్య‌ర్థించాడ‌ట‌. సైరా-న‌ర‌సింహారెడ్డి స‌వ్యంగా 2019 సంక్రాంతి బ‌రిలో రిలీజైపోతే, అటుపై బోయ‌పాటి-దాన‌య్య సినిమా రిలీజ్ తేదీని లాక్ చేస్తార‌ట‌. ఒక‌వేళ సైరా స‌మ్మ‌ర్ రేసులోకి వెళితే .. త‌న‌ సినిమాని సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌న చ‌ర‌ణ్‌ చేశార‌ట‌. లేదంటే అక్టోబ‌ర్‌లోనే చ‌ర‌ణ్ – బోయ‌పాటి సినిమా రిలీజ‌వుతుంద‌ని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారికంగా నిర్మాత‌లు ప్ర‌క‌టించాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments