హాలీవుడ్లో స్టపప్ సిరీస్ అనంతంగా సాగుతూ అసాధారణ విజయాలు సాధిస్తూనే ఉంది. ఇప్పుడు అదే తీరుగా బాలీవుడ్‌లోనూ రెమో డి.సౌజా సారథ్యంలో `ఎబిసిడి` సిరీస్ రన్ అవుతోంది. ఈ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పటికే రెండు క్రేజీ సినిమాలు రిలీజై సంచలన విజయం సాధించాయి. యూత్‌ని డ్యాన్సు మహత్తులోకి నెట్టేసే అద్భుతమైన సినిమాలుగా వీటికి క్రేజు వచ్చింది. అందుకే ఇప్పుడు రెమో అంతకుమించి క్రేజీగా పార్ట్ 3ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఎబిసిడి-1, ఎబిసిడి -2 చిత్రాల్లో పలువురు యువకథానాయకులు, యువకథానాయికలు నటించారు.
కానీ ఈసారి పార్ట్ 3లో మాత్రం కత్రిన యాడవుతోంది. ఈ భామ వరుణ్ ధావన్‌కి పెయిర్‌గా నటించనుంది. వాస్తవానికి పార్ట్ 2లో నటించిన శ్రద్ధా కపూర్ వేరే ప్రాజెక్టులకు కమిటవ్వడంతో ఇలా కత్రినను ఎంపిక చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఏదైతేనేం క్యాట్ డ్యాన్సింగ్ విన్యాసాలు మరోసారి వీక్షించే సద్భాగ్యం అభిమానులకు కలిగింది. ఇక వరుణ్ ధావన్ పార్ట్ -1లో లేకపోయినా పార్ట్ 2తో ఎంట్రీ ఇచ్చి తడాఖా చూపించాడు. మేటి డ్యాన్సింగ్ స్టార్‌గా తనని తాను ఆవిష్కరించుకున్నాడు. అందుకే ఇప్పడు పార్ట్ 3లో కీరోల్ పోషిస్తున్నాడు. ఇదే విషయాన్ని చెబుతూ `టెర్రిఫిక్ డ్యాన్సింగ్ మూవీ ` అంటూ కితాబిచ్చాడు తరణ్. 19 మార్చి 2018న నటీనటుల వివరాలు ప్రకటించి అటుపై చిత్రీకరణకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 8 నవంబర్ 2019కి సినిమా రిలీజ్ కానుంది.