రేవంత్ రెడ్డి దెబ్బ.. మైహోమ్స్, ప్రభుత్వానికి హైకోర్ట్ నోటీసులు..!

Monday, February 10th, 2020, 08:09:54 PM IST

మైహోమ్స్ సంస్థకు లబ్ధీ చేకూరే విధంగా, నిబంధనలకు వ్యతిరేకంగా భూముల కేటాయింపు జరిగిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేశారు. రంగా రెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని రాయదుర్గంలో 31.35 ఎకరాల భూములను అభివృద్ధి చేసేందుకు నిబంధనలకు వ్యతిరేకంగా డీఎల్ఎఫ్ రాయదుర్గ్ డెవలపర్స్ సంస్థకు కేటాయించారని, ఆ తరువాత డీఎల్ఎఫ్ రాయదుర్గ్ డెవలపర్స్ సంస్థను ఆక్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుగా మార్చుకోవడానికి అనుమతి ఇచ్చారని పిటీషన్‌లో పేర్కొన్నారు.

అయితే ఆక్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మైహోమ్స్ గ్రూపునకు చెందినది కావడంతో ఇందులో అవకతవకలు జరిగాయని దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్‌ని పరిశీలించిన హైకోర్ట్ మైహోమ్స్ అధినేత రామేశ్వర్ రావుకు, ప్రభుత్వానికి, డీఎల్ఎఫ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.