రివ్యూ రాజా తీన్‌మార్ : ‘కృష్ణార్జున యుద్ధం’ – అర్జునుడు విఫలమైనా.. కృష్ణుడు నడిపించాడు

Thursday, April 12th, 2018, 06:01:34 PM IST

 

తెరపై కనిపించిన వారు : నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్
కెప్టెన్ ఆఫ్ ‘ కృష్ణార్జున యుద్ధం’ : మేర్లపాక గాంధీ

మూల కథ :

చిత్తూరు జిల్లా అక్కుర్తి గ్రామంలో ఉండే కృష్ణ (నాని) సర్పంచ్ మనవరాలు రియా (రుక్సార్ మీర్)ను ప్రేమిస్తాడు. ఆమె కూడ అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ప్రేమకు ఒప్పుకోకుండా రియాను హైదరాబాద్ పంపేస్తారు.

అలాగే యూరప్లో ఉండే రాక్ స్టార్ అర్జున్ (నాని) సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్)ని ప్రేమిస్తాడు. కానీ సుబ్బలక్ష్మి అతన్ని ప్రేమించకుండా హైదరాబాద్ వచ్చేస్తుంది. అలా హైదరాబాద్ వచ్చిన ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండాపోతారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఏమయ్యారు, వాళ్లకు ఏర్పడిన ప్రమాదం ఏమిటి, ఆ ప్రమాదం నుండి వారిని కృష్ణ, అర్జున్ లు ఎలా కాపాడారు అనేదే సినిమా.

విజిల్ పోడు :
–> హీరో నాని కథలోని కృష్ణ పాత్రలో నటించిన తీరు అద్భుతం. ఆయన చిత్తూరు యాస, పల్లెటూరి కుర్రాడిగా ఆయన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ అమితంగా ఆకట్టుకున్నాయి. సినిమాను చాలా వరకు ఆయనే మోశాడు. కాబట్టి మొదటి విజిల్ ఆయనకే వేయాలి.

–> దర్శకుడు మేర్లపాక గాంధీ సినిమా ఫస్టాఫ్ ను మంచి స్క్రీన్ ప్లే, పాత్రలు, లవ్ ట్రాక్స్, హాస్యంతో నింపేసి ఆద్యంతం ఆకట్టుకున్నాడు. కనుక రెండో విజిల్ గాంధీకి వేయాలి.

–> సినిమాలోని అన్ని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోగా, నటుడు బ్రహ్మాజీ ఇంప్రెస్ చేశాడు. అలాగే హీరోయిన్లు అనుపమ, రుక్సార్ లు కూడా పర్వాలేదనిపించారు. ఈ అన్ని అంశాలకు కలిపి మూడో విజిల్ వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> ఫస్టాఫ్ బాగుంది అనుకునేలోపు సెకండాఫ్ రొటీన్ ధోరణిలోకి మారిపోతుంది. దీంతో నిరుత్సాహం మొదలవుతుంది.

–> హీరోలిద్దరూ కలిసి హీరోయిన్లను వెతికే సమయంలో చేసే ప్రయత్నాలేవీ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాయి.

–> ద్వితీయార్థంలో ముఖ్యమైన అంశాలు వేటికీ బలమైన రీజన్స్ ఉండవు. క్లైమాక్స్ కూడ రొటీన్ గా ఎక్కువసేపు లాగినట్టు ఉంటుంది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

ఈ సినిమాలో పెద్దగా వింతగా తోచే అంశాలేవీ కనబడలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఎ : నాని చేసిన రెండు పాత్రల్లో నీకు ఏది నచ్చింది ?
మిస్టర్ బి : కృష్ణ పాత్రే బాగా నచ్చింది. నాని కూడ భలేగా చేశాడు.
మిస్టర్ ఎ : అవును.. అర్జున్ పాత్ర అయితే తేలిపోయింది.
మిస్టర్ బి : ఆ పాత్ర కూడ కొంత బలంగా ఉంటే బాగుండేది.