దయచేసి నన్ను క్షమించండి… ఆర్జీవీ

Saturday, April 21st, 2018, 11:12:31 AM IST

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్నది తానేనంటూ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెప్పడంతో యావత్‌ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురికావడమే కాకుండా, ఆయన చేసిన పనికి అందరూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వర్మ చర్యలపై నిన్న అల్లు అరవింద్‌ ధ్వజమెత్తగా, నేడు పవన్‌కల్యాణ్‌ స్వయంగా రంగంలోకి తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ‘మా’ అసోసియేషన్‌, నిర్మాతల మండలిని పవన్‌ ప్రశ్నించారు. శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తానున్నానని రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించారు. తనకు న్యాయం జరిగే వరకు ఫిలిం ఛాంబర్‌ వదిలి వెళ్లేది లేదని పవన్‌ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు పవన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌ కూడా పవన్‌కు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ వర్మ మరోసారి క్షమాపణలు చెప్పారు. ‘మీ మనోభావాలను అర్థం చేసుకున్నా. తప్పు చేశాను. ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పాను సర్‌’ అని ట్వీట్‌ చేశారు.

మరోవైపు వర్మపై న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చన్న అంశంపై అల్లు అరవింద్‌, పవన్‌కల్యాణ్‌ న్యాయవాదులతో చర్చించారు. తన తల్లిపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండించకుండా గంటల పాటు చర్చలు పెట్టి టీఆర్పీ రేటింగుల కోసం కొన్ని ఛానళ్లు పాకులాడుతున్నాయని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments