రివ్యూ రాజా తీన్‌మార్ : ‘రంగస్థలం’ – చిట్టిబాబు చితగ్గొట్టాడు

Friday, March 30th, 2018, 05:00:53 PM IST

తెరపై కనిపించిన వారు : రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి
కెప్టెన్ ఆఫ్ ‘ ‘రంగస్థలం’ : సుకుమార్

మూల కథ :
రంగస్థలం అనే ఊళ్ళో ఉండే వ్యక్తి చిట్టిబాబు (రామ్ చరణ్). వినికిడి లోపంతో ఉండే చిట్టిబాబుకు వాళ్ళ అన్నయ్య కుమార్ బాబు (ఆది పినిశెట్టి) అంటే ఎంతో ఇష్టం. ఊళ్ళో ఉండే అక్రమార్కుడైన ప్రెసిండెంట్ (జగపతిబాబు)ను గద్దె దించడానికి కుమార్ బాబు అతనికి పోటీగా ఎన్నికల్లో నిలబడతాడు.

ఎన్నికల సమయానికి కుమార్ బాబును కొందరు దుండగులు హత్య చేస్తారు. దీంతో పగ పెంచుకున్న చిట్టిబాబు అన్నను చంపిన వాళ్లను చంపాలని అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అసలు కుమార్ బాబును చంపింది ఎవరు, ఎందుకు చంపారు, వాళ్ళను చిట్టిబాబు ఎలా కనిపెట్టాడు, ఏం చేశాడు అనేదే మిగతా కథ.

విజిల్ పోడు :

  •  కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటన చాలా గొప్పగా ఉంది. ఇదివరకటి సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో ఆయన పూర్తి స్థాయిలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా సెకండాఫ్లోని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో జీవించేశాడు. కాబట్టి మొదటి విజిల్ ఆయనకే వేయాలి.
  •  దర్శకుడు సుకుమార్ ఈ సారి ఎలాంటి క్లిష్టత లేకుండా సాధారణమైన, వాస్తవికతకు దగ్గరగా ఉండే కథతో, పాత్రలతో సినిమా చేయడం బాగుంది.
  • కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన, రంగమ్మత్తగా అనసూయ పెర్ఫార్మెన్స్, ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు నటన బాగున్నాయి. అలాగే విలేజ్ సెట్ వర్క్ చాలా బాగుంది. ఈ అన్ని అంశాలకు కలిపి మూడో విజిల్ వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

  •  సినిమా ఫస్టాఫ్ మొత్తం పాత్రలు, సన్నివేశాలను ఆధారం చేసుకుని నడుస్తుంది తప్ప అసలు కథ మొదలవదు. దాంతో ఫస్టాఫ్ తో ఎమోషనల్ గా కనెక్టవ్వడం కష్టమైంది.
  • ద్వితీయార్థం ఆరంభంలో అనవసరంగా సన్నివేశాలను సాగదీసి కొంత బోర్ కొట్టించారు.
  •  రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ బాగున్నా ఒక మాస్ హీరోకు ఉండాల్సిన ఎలివేషన్ సినిమాలో లేదు. ఇది అభిమానులకు కొంత నిరుత్సాహం కలిగించే అంశం.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

ఈ సినిమాలో పెద్దగా వింతగా తోచే అంశాలేవీ కనబడలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఎ : రామ్ చరణ్ చిట్టిబాబుగా చితగ్గొట్టేశాడుగా !
మిస్టర్ బి : అవును.. ఇంత వరకు అతనిలో ఇంతటి నటుడున్నాడనే అనుకోలేదు. సినిమను నిలబెట్టేశాడంతే.
మిస్టర్ ఎ : ఏదైనా చేసే పాత్రని బట్టే ఉంటుంది.
మిస్టర్ బి : ఇకపై కూడ ఆయన ఇలాంటి బలమైన పాత్రలే ఎంచుకుంటే బాగుంటుంది.