రహదారులే ప్రమాదాలకు కారణం

Tuesday, September 16th, 2014, 11:26:51 AM IST


హైదరాబాద్ నగరంలో అత్యధిక సంఖ్యలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణం సరైన డిజైన్ లేని రోడ్లు,సిగ్నల్స్ లేని జంక్షన్ లు మొదలగు అంశాలేనని అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ లోపాలను సరి చెయ్యమని చెప్పినప్పటికీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని వీరు పేర్కొన్నారు. కాగా ఆక్సిడెంట్ లకు కారణం కేవలం వాహనదారుల నిర్లక్ష్యమేనని పేర్కొనడం సమంజసం కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక దీనిపై సర్వే చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ లోపాలను సరి చెయ్యాల్సిన విధానాలతో కూడిన నివేదికను జీహెచ్ఎంసీ అధికారులకు అందచేశారు.

అయితే అతివేగం, మద్యం తాగి డ్రైవ్ చెయ్యడం, సిగ్నల్స్ ను మిస్ చెయ్యడం, తప్పుదారిలో డ్రైవ్ చెయ్యడం మొదలగునవి సహజంగా రోడ్డు ప్రమాదాలకు దారి తీసే అంశాలు. కాగా రోడ్డు ప్లానింగ్ లో ఉన్న లోపాలు కూడా ఆక్సిడెంట్ లకు కారణమేనని వాటిని సరి చేస్తే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డీసీపీ శ్యామ్ సుందర్ అభిప్రాయపడ్డారు. సన్నని దారులు, బ్లైండ్ కార్నర్లు, సిగ్నల్ లేని జంక్షన్ లు మొదలగునవి కూడా ఆక్సిడెంట్ లకు ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు. అలాగే రోడ్ పక్క పార్కింగ్ లు చెయ్యడం కూడా ఆక్సిడెంట్ లకు దారి తీస్తున్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.