డెబ్యూ హీరోని మాస్ మ‌హారాజా రేంజులో చూపిస్తున్నాడుట‌!

Sunday, February 12th, 2017, 09:52:59 AM IST


స్టార్ల‌ను సూప‌ర్‌స్టార్ల‌ను చేయ‌డం.. డెబ్యూ హీరోల‌ను స్టార్లుగా త‌యారు చేయ‌డం క్రేజీ డైరెక్ట‌ర్ పూరీజ‌గ‌న్నాథ్‌కి కొత్తేమీ కాదు. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హీరోని ఎలివేట్ చేయ‌డం పూరీ స్ట‌యిల్‌. అందుకే ఆల్రెడీ స్టార్లు అయిన‌ హీరోలు ఇంకో మెట్టు ఎక్కేందుకు పూరీతో సినిమా చేయాల‌నుకుంటారు. అలాగే మొద‌టి సినిమాతోనే స్టార్‌డ‌మ్ చేజిక్కించుకోవాల‌నుకునే డెబ్యూలు పూరి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని ఉవ్విళ్లూరతారు.

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ని ఓవ‌ర్‌నైట్ స్టార్‌ని చేసింది పూరీనే. `ఇడియ‌ట్‌` సినిమాతో ర‌వితేజ రేంజు ఒక్క‌సారిగా మారిపోయింది. అలాగే ప్రిన్స్ మ‌హేష్‌ని సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ని చేసింది కూడా పూరీనే. ఆరోజుల్లోనే `పోకిరి` లాంటి ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్‌ని తీశారు పూరి. సంచ‌ల‌నాల `పోకిరి`ని మ‌హేష్ కెరీర్‌కి ఇచ్చింది పూరీనే. `దేశ‌ముదురు` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ని బ‌న్నికి ఇచ్చి 6ప్యాక్ హీరోగా ఎలివేట్ చేసింది పూరి జ‌గ‌న్నాథ్‌. తార‌క్ లుక్‌ `టెంప‌ర్‌` సినిమాతో అనూహ్యంగా మార్చేసిన ఘ‌న‌త, `ఇజం`తో క‌ళ్యాణ్‌రామ్‌ని కొత్త లుక్‌లో ఆవిష్క‌రించిన ఘ‌న‌త‌ పూరీకే ద‌క్కుతుంది. `చిరుత‌` సినిమాతో రామ్‌ చ‌ర‌ణ్‌ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేసి ఆరంభ‌మే కిక్ స్టార్ట్ ఇచ్చింది పూరీనే. క‌న్న‌డ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ని తెర‌కు ప‌రిచ‌యం చేసింది పూరి. నేడు పునీత్ అక్క‌డ పెద్ద స్టార్ హీరో.

లేటెస్టుగా మ‌రో డెబ్యూ హీరోని పూరి జ‌గ‌న్నాథ్ ప‌రిచ‌యం చేస్తుండ‌డం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. `మ‌హాత్మ‌` నిర్మాత సి.ఆర్‌.మ‌నోహ‌ర్ త‌న‌యుడు ఇషాన్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ పూరి `రోగ్‌` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇషాన్‌ని మ‌రో ర‌వితేజ రేంజులో ఆవిష్క‌రించాడ‌ని చెబుతున్నారు. కొత్త హీరోల్ని ఎలివేట్ చేయ‌డంలో పూరీకి ఉన్న ట్రాక్ రికార్డ్‌, పెర్ఫామెన్సెస్ రాబ‌ట్ట‌డంలో పూరి ఎన‌ర్జీ లెవ‌ల్స్‌పై న‌మ్మ‌కం ఉన్న బ‌య్య‌ర్లు ప్ర‌స్తుతం ఈ సినిమా రైట్స్ చేజిక్కించుకునేందుకు పోటీప‌డుతున్నార‌ని తెలుస్తోంది. పూరి- ఇషాన్ కాంబినేష‌న్‌లోని `రోగ్‌` చిత్రాన్ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌మోష‌న్ ప‌రంగానూ స్పీడ్ పెంచే ప్లాన్‌లో పూరి ఉన్నార‌ని తెలుస్తోంది.