ఆ విషయంలో చంద్రబాబుపై ఫైర్ అయిన వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా..!

Tuesday, August 20th, 2019, 10:09:11 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే, టీడీపీ మాత్రం ఘోర పరాభవాన్ని చవి చూసింది. అయితే ఈ ఎన్నికలలో వైసీపీ ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాలను గెలుచుకుని విజయ దుందుభి మోగించింది. అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినా నగరి ఎమ్మెల్యే రోజాకు మాత్రం మంత్రివర్గంలో స్థానం లభించలేదు. అయినా కూడా రోజాలో ఫైర్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీపై ఎలా నిప్పులు చెరిగిందో, అధికారంలోకి వచ్చాక అంతకు మించి నిప్పులు చెరుగుతూ వస్తుంది.

అయితే తాజాగా చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగింది. చంద్రబాబు వరద రాజకీయం చేస్తున్నారంటూ, ముఖ్యమంత్రి హోదాలో అక్రమ కట్టడంలో ఉన్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలి అంటూ తనదైన శైలిలో విమర్శించారు. డ్రోన్ కెమెరాలంటే బాబుకు ఎందుకంత భయం అంటూ ప్రశ్నించారు. జగన్ పాదయాత్రలో డ్రోన్ లు ఉపయోగించినప్పుడు అప్పుడు తప్పని చంద్రబాబుకు తెలియలేదా అంటూ నిలదీశారు. చంద్రబాబును వైసీపీ టార్గెట్ చేసిందంటూ టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఎవరూ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలే చంద్రబాబును టార్గెట్ చేసి ఇంటికి పంపించారని అది గుర్తుపెట్టుకుని నడుచుకుంటే చంద్రబాబుకు మర్యాద దక్కుతుందని హెచ్చరించారు.