ఒక్క ట్వీటుకు ఆయనకు రూ.7 కోట్లు!

Thursday, May 10th, 2018, 04:05:25 PM IST

ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు డ్వేయిన్ జాన్సన్ కు వున్న పేరు ప్రఖ్యాతలు అంతా ఇంతా కాదనే చెప్పాలి. స్వతహాగా జాన్సన్ ఒక రెజ్లర్, నిజానికి ఆయన దేహధారుడ్యాన్ని బట్టి రెజ్లింగ్ లో అందరూ ది రాక్ అంటుంటారు. అయితే తనకు సినిమాల పట్ల వున్న ఆసక్తితో హాలీవుడ్ చిత్రాల్లో నటించడం మొదలుపెట్టారు జాన్సన్. ఇప్పటికేవరకు ఆయన నటించిన చిత్రాల్లో చాలావరకు మంచి విజయాన్ని అందుకున్నవే ఎక్కువ. ఇటీవల బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జాన్సన్ సరసన బేవాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించి మంచి వసూళ్లు అందుకుంది.

కాగా జాన్సన్ కు వున్న క్రేజ్ ఎంతంటే ఆయనకు సోషల్ మీడియా మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లలో వున్న ఫాలోవర్ లు కోట్లలోనే వుంటారు. అందువల్ల ఆయన నటించిన చిత్రాలకు ప్రమోషన్ చేసినందుకు, అంటే ఒక్కపొస్ట్ పెట్టినందుకు అక్షరాలా ఒక మిలియన్ డాలర్లు అంటే మన భారతీయ రూపాయి ప్రకారం (రూ.7కోట్లు) తీసుకుంటాడన్నమాట. ప్రస్తుతం 220మిలియన్ డాలర్ల సంపన్నుడైన రాక్ ఇటీవల ఫోర్బ్ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో చోటుదక్కించుకున్నాడు. ప్రస్తుతం రాక్ రెడ్ నోటీస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది…….