సాహో..ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ రేంజులో?

Monday, May 14th, 2018, 11:25:47 AM IST

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో `సాహో` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఇదివ‌ర‌కెన్న‌డూ రాని అసాధార‌ణ యాక్ష‌న్ చిత్ర‌మిది. బాహుబ‌లికి ధీటుగా దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా బ‌డ్జెట్ అంత‌కంత‌కు పెరుగుతోంద‌న్న స‌మాచారం ఉంది.

హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ కెన్నీ బేట్స్ ఈ చిత్రానికి ఫైట్స్ అందించ‌డంతో బడ్జెట్ కూడా అదే రేంజులో ఖ‌ర్చ‌వుతోందిట‌. ఇక సాహోకి అత‌డు ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ రేంజు యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ని డిజైన్ చేశాడ‌ని తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ఈపాటికే దుబాయ్ షెడ్యూల్‌కి ప్యాక‌ప్ చెప్పేయాల్సి ఉన్నా.. ఈ షెడ్యూల్‌ని ఇంకో రెండువారాలు పొడిగించార‌ట‌. అంతేకాదు జూన్ వ‌ర‌కూ చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఓ భారీ ఛేజ్ స‌న్నివేశం తెర‌కెక్కిస్తున్నారు. ఈ సీన్‌లో అత్యంత ఖ‌రీదైన స్పోర్ట్స్ బైక్‌లు, ల‌గ్జ‌రీ కార్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. అలానే భారీ ట్రాన్స్‌పోర్ట్ ట్ర‌క్‌ల‌ను వినియోగిస్తున్నారు. హిటాచీ ట్ర‌క్స్‌, కాట‌ర్‌పిల్ల‌ర్ ట్రక్స్‌తో భారీ ఛేజ్ తెర‌కెక్కిస్తున్నారు. దుబాయ్‌లోని ఓ భారీ ఫ్లైఓవ‌ర్‌పై నుంచి ట్ర‌క్ కిందికి ప‌డిపోయే సీన్‌లో ప్ర‌భాస్ అసాధార‌ణంగా గాల్లోకి జంప్ చేసే రిస్కీ షాట్‌ని తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ప్ర‌భాస్ కెరీర్ బెస్ట్ యాక్ష‌న్ ఎపిసోడ్ .. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే హైఎండ్ టెక్నిక్‌తో తీస్తున్న యాక్ష‌న్ స‌న్నివేశంగా చెబుతున్నారు. ఇప్పుడ‌ర్థ‌మైందా? ఈ సినిమాకి అసాధార‌ణంగా 300 కోట్ల బ‌డ్జెట్ ఎందుకు ఖ‌ర్చు చేస్తున్నారో?