మరో మెగా సాంగ్ రీమేక్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్!

Wednesday, January 24th, 2018, 04:25:24 PM IST

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన ప్రతి చిత్రంతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్నారు. అంతే కాక వీలైనప్పుడు అడపా దడపా ఆయన మామయ్య మెగాస్టార్ చిత్రాల్లోని హిట్ పాటలను ఎంచుకుని వాటిని తన చిత్రాల్లో రీమేక్ చేయడం చేస్తుంటారు. ఇదివరకు గోలిమార్, సుప్రీమ్ హీరో, గువ్వా గోరింకతో పాటలను ఆయన తన సినిమాల్లో రీమేక్ చేసి అభిమానులు, ప్రేక్షకులనుండి మంచి మార్కులే పొందారు. అయితే ప్రస్తుతం ఆయన మాస్ దర్శకులు వి. వి. వినాయక్ దర్శకత్వం లో ఇంటెలిజెంట్ అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో ఆయన సరసన లావణ్య త్రిపాఠి జోడి కడుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం లో కూడా చిరు నటించిన కొండవీటి దొంగ చిత్రం లోని ‘చమకు చమకు చాం’ పాటను రీమేక్ చేసినట్లు తెలుస్తోంది. ఏ మాత్రం చిరంజీవి పాటలోని నేటివిటీ ని పోగొట్టకుండా ఇప్పటితరానికి నచ్చేలా తేజు వేసిన స్టెప్పులు చూస్తుంటే అచ్ఛం చిరంజీవి గారినే చూస్తున్నట్లు ఉందని దర్శకులు వి. వి. వినాయక్ అంటున్నారు. ఈ పాటని థియేటర్స్ లో చూసిన ఫాన్స్ తప్పకుండా ఖుషి అవుతారని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇప్పటివరకు దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాత సి కళ్యాణ్ సి కే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు….