అర్జున్ రెడ్డి తో జోడి కట్టనున్న సాయిపల్లవి?

Thursday, June 14th, 2018, 11:23:38 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అప్పటికే పెళ్లి చూపులతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో మరింత పేరు సంపాదించాడు. అంతే కాదు ఆయనకు ఆతరువాత ఆఫర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అయితే విజయ్ మాత్రం తన చిత్రాల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఇక తొలి చిత్రం ఫిదాతో తెలుగు ప్రేక్షకుల మది దోచిన భామ సాయి పల్లవి, తదుపరి నాని ఎంసీఏ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలోవేసుకుంది. అయితే ఆమె కూడా తన చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్, సాయి పల్లవి ఇద్దరు కూడా తెలంగాణ ప్రాంత యాస లో మాట్లాడడంలో మంచి పేరుగాంచిన వారు అనేది వారి చిత్రాలను బట్టి చూస్తే అర్ధమవుతుంది. కాగా ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక చిత్రంలో నటించనున్నారని వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. హీరో శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న పడిపడి లేచే మనసు చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని టాక్. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియనప్పటికీ ఒకవేళ నిజం అయితే మాత్రం ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూసే అవకాశం ప్రేక్షలుకు వచ్చినట్లే. అయితే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడితేనేకాని ఏ విషయం చెప్పలేం…..