సల్మాన్ పరిస్థితి ధారుణం.. జైల్లో నిద్ర లేదట!

Friday, April 6th, 2018, 04:28:22 PM IST

1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో నిన్న జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ కు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్‌ కు 106 నెంబర్ ఇచ్చి అత్యంత భద్రత కలిగిన బ్యారక్‌ నంబరు 2 గదిని కేటాయించారు. అయితే సల్మాన్ రాత్రి మొత్తం నిద్రపోలేదని జైలు అధికారుల ద్వారా తెలిసింది. సల్మాన్ ను అక్కడ ఒక సాధారణ ఖైదీకి ఇచ్చిన సదుపాయాలనే ఇచ్చారు. సల్మాన్ కు ఒక రగ్గు, కూలర్ మాత్రమే ఇచ్చామని జైలు సూపరింటెండెంట్‌ విక్రమ్‌ సింగ్‌ తెలిపారు.

ఇక సల్మాన్ తో పాటు పక్కనే లైంగిక వేధింపుల కేసులో ఇదే జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఆశారాం బాపు ఉన్నారు. సల్మాన్ – ఆశారాం బాపులకు మధ్య ఒక పరదా మాత్రమే అడ్డుగా ఉందట. అయితే సల్మాన్ కు రాత్రి జైలు అధికారులు ఒక చపాతీ అలాగే పప్పు ఇవ్వడంతో ఆయన నిరాకరించారని తెలుస్తోంది. ఇక ఆశారాం బాపు పక్కనే తన ఆశ్రమం నుంచి రోజు భోజనం తెప్పించుకుంటారు. అందులో కొంత సల్మాన్ కు ఇవ్వడంతో ఆయన భోజనం చేసినట్లు సమాచారం. అనంతరం పరుపు కూడా ఇవ్వబోతోంటే సల్మాన్ నిరాకరించాడట. తనకు ఇచ్చిన రగ్గు కింద వేసుకొని పడుకున్నట్లు సమాచారం. ఇక సల్మాన్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేకపోవడంతో వైద్యులు పరీక్ష చేసి ట్యాబ్లెట్లు ఇచ్చినట్లు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments