జింక‌ను ర‌క్షించానంతే.. భాయ్ యూట‌ర్న్‌?

Thursday, April 5th, 2018, 11:59:36 AM IST

కృష్ణ జింక‌ల వేట‌లో రెండు జింక‌ల్ని స‌ల్మాన్ ఖాన్ సంహ‌రించార‌ని ఓవైపు కోర్టులో వాదోప‌వాదాలు సాగాయి. ఈ కేసులో జోధ్‌పూర్ కోర్టు కీల‌క‌మైన తుది తీర్పును వెలువ‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. నేటి తుది తీర్పు కోసం ప్ర‌పంచం యావ‌త్తూ స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోంది. స‌ల్మాన్ భాయ్ ఈ కేసు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డతారో.. అంటూ అభిమానులు కాస్తంత ఆందోళ‌న‌గానే ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి వేళ జాతీయ మీడియాలో ఓ క‌థ‌నం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఇందులో స‌ల్మాన్ భాయ్ మాట్లాడిన తీరు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. “షూటింగ్ ప్యాక్ చేసి తిరిగుప‌య‌న‌మ‌య్యాం. ఆ టైమ్‌లో ఒక పొద‌లో చిక్కుకున్న జింక‌ను చూశాం. అది బెదురుబెదురుగా చూస్తోంది. ఆ క్ర‌మంలోనే దానిని ర‌క్షించి, చేర‌దీసి నీళ్లు పోశాను. ఆ త‌ర‌వాత బిస్కెట్లు కూడా తిని అది అక్క‌డి నుంచి వెళ్లిపోయింది..అక్క‌డి నుంచే వివాదం మొద‌లైంది“ అంటూ స‌ల్మాన్ తెలిపారు. అయితే రెండు జింక‌ల్ని చంపాడు అంటూ ఎందుకు కేసు పెట్టిన‌ట్టు? ఈ కేసులో ఇంకా స‌ల్మాన్ తాను జింక‌ల్ని చంప‌లేద‌నే వాదించాడా? అస‌లు తీర్పు ఏం వెలువ‌డ‌నుంది? చూడాలి.