నిర్భయ నిందితులకు ఆంక్షలు : పూర్తవుతున్న ఉరి ఏర్పాట్లు…

Saturday, December 14th, 2019, 11:50:44 AM IST

గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ హత్యోదంతం విషయంలో భాగస్వామ్యమైన నిందితులకు మరికొద్ది రోజుల్లో ఉరి శిక్ష వేయనున్నారు. అయితే తొందర్లోనే ఈ నిందితులకు ఉరి శిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో ఆ నిందితులకు తీహార్ జైలులో, జైలు అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు. అయితే ఇప్పటివరకు కూడా ఆ నిందితులు జైలులో కలుసుకొని మాట్లాడుకునే వారు. కాగా ఆ నలుగురు నిందితులు ఇప్పటినుండి ఒకరినొకరు కలుసుకోకుండా, మాట్లాడుకోకుండా ఉండేందుకు జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, వారిని వేరు వేరు గదుల్లోకి మార్చేశారు.

ఇకపోతే వారి ఉరికి రోజులు దగ్గరపడుతుండడంతో ఆ నిందితులు ఉన్నటువంటి తీహార్ జైలులో సంబంధిత అధికారులు ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ప్రత్యేకంగా ఈ కేసు విషయంలో అత్యంత జాగ్రత్తలను తీసుకోవడానికి తమిళనాడు నుంచి ప్రత్యేక పోలీసు దళాన్ని తీసుకొచ్చారు. కాగా ఇప్పటికే జైలులోని ఉరి తీసే గదిని శుభ్రం చేసి, తుప్పు పట్టిన ఉరిస్తంభాన్ని శుభ్రం చేయించి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.