సావిత్రి చిన్ననాటి నుండి అంతే : బాల్య స్నేహితురాలు సుశీల

Friday, May 25th, 2018, 04:56:50 PM IST

మహానటి సావిత్రి జీవిత గాధగా తెరకెక్కిన మహానటి అద్భుత విజయం అందుకున్న విషయం విదితమే. హీరోయిన్ కీర్తి సురేష్ నాటి సావిత్రిని మన కళ్ళకు కట్టినట్లు తన నటన ద్వారా చూపారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం సినిమాకి ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల సావిత్రి బాల స్నేహితురాలు సుశీల సావిత్రి గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. ఆమె మాట్లాడుతూ సావిత్రి, నేను కలిసి చిన్నప్పుడు విజయవాడ లో షికారుకి వెళ్లేవాళ్లమని, ఆమె తరువాత హీరోయిన్ అయ్యాక కూడా ఎప్పడూ తనకి ఉత్తరాలు రాస్తూ నా గురించిన యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేదని చెప్పుకొచ్చారు. అలానే మేమిద్దరం చిన్నపుడు మా ప్రక్క ఊర్లో డాన్స్ నేర్చుకోవడానికి వెళ్లే వాళ్ళం. అక్కడకు నడిచి వెళ్లడం కష్టం కనుక ఇంట్లోవాళ్ళు రిక్షాలో వెళ్ళమని డబ్బులు ఇచ్చేవారట.

అప్పట్లో మనుషులు లాగే రిక్షాలు ఉండేవని, అందువలన సావిత్రి మనం కూర్చుని ఉంటే వేరొకరు మనల్ని బోలెడు దూరం ఇబ్బంది పడుతూ లాక్కెళ్లడం సరైనది కాదని, వారు కూడా మనుషులేనని రిక్షాలో కాకుండా నడిచి వెళ్దాము అని చెప్పేవారట. అంతే కాదు ఎవరు సమస్యల్లో వున్నా చూస్తూ ఊరుకునే వారు కాదట సావిత్రి. తనదగ్గర ఆ సమయంలో ఎంత ఉంటే అంత ఇచ్చేసేవారట. మరి నీకు లేదుగా అంటే, వాళ్ళు కూడా మన లాంటి వారే కదా, మనుషులని మనుషులే ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారని చెప్పేవారట. అయితే ఆమె చిన్ననాటి నుండి చివరి రోజులవరకు తన దగ్గర వున్నదానిలోనే పక్క వారికి పంచిపెట్టేవారని, అందుకే సావిత్రి మరణించి ఇన్ని ఏళ్ళు అయినా ఆమె మంచితనం గురించి అందరూ ఇప్పటికీ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారని సుశీల చెప్పుకొచ్చారు……

  •  
  •  
  •  
  •  

Comments