రాష్ట్ర హోంమంత్రి పేరిట మోసాలు – నిందితుడి అరెస్ట్…?

Friday, May 22nd, 2020, 02:30:33 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక రవాణా విషయంలో దారుణమైన అక్రమాలు జరుగుతున్నాయని, కొందరు చట్ట విద్రోహక చర్యలకు పాల్పడుతున్నారని గమనించిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పలు కీలకమైన అంశాలను వెల్లడించారు. కాగా వివరాల్లోకి వెళ్తే… సీఐ శోభన్ బాబు కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత ఫోటోని ఒక వ్యక్తి తన వాట్సాప్‌ ఫ్రొఫైల్‌కు పెట్టుకుని, ఇసుక తరలింపులో మోసాలకు పాల్పడుతుండటాన్ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా గుంటూరు ఎస్‌వీన్‌ కాలనీకి చెందిన శరత్‌చంద్ర వరప్రసాద్‌ పెదకాకాని ఆటోనగర్‌ వై జంక్షన్‌వద్ద గల ఇసుక డంపింగ్‌ యార్డులో డేటా ప్రాసెసింగ్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

కాగా ఆ నిందితుడు కాస్త అతితెలివిని వాడుతూ, తన ఫోన్‌ నంబర్‌కు ట్రూకాలర్ ప్రొఫైల్ లో హోంమంత్రి సుచరిత ఫొటో పెట్టుకున్నాడు. కాగా గత కొంత కాలంగా తాను హోం మినిస్టర్‌ ఆఫీస్‌లో పని చేస్తానని, ఆటోనగర్ ప్రాంతానికి చెందిన‌ డంపింగ్‌ యార్డులో ఇసుక రవాణా అంతా కూడా తానూ చెప్పిన విధంగానే నడుస్తుందని, తన అనుమతిలేకుండా ఇసుక రవాణా జరగదని చెబుతూ ఇప్పటికేఇలా చాలా మందిని మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడని పెదకాకానికి చెందిన బండ్లమూడి భానుకిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేయగా రిమాండ్‌ విధించినట్లు సీఐ శోభన్ బాబు తెలిపారు.