స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ సర్కార్‌కు, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మధ్య వివాదం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని అసెంబ్లీలో నిన్న తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కు లేఖ రాశారు.
స్థానిక ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ఖ్ కింద ఎన్నికల కమిషన్ కు స్వయం ప్రతిపత్తి ఉందని, ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం ఎలక్షన్ కమిషన్ విధి అని అన్నారు. కేంద్ర ఎన్నికల కమీషన్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు సమాన అధికారాలుంటాయని, ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికలు జరపాలనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అలాంటి ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలని, అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయనిపుణులను సంప్రదించండి అంటూ గవర్నర్‌కి రాసిన లేఖలో సూచించారు.