ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోని అధికారులపై వరుసగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్‌ను తొలగిస్తూ నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాణీమోహన్ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని సీఎస్‌కు లేఖ రాశారు. అంతేకాదు వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‌పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 30 రోజులపాటు సెలవుపై వెళ్లిన జీవీ సాయి ప్రసాద్, ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని అభియోగాలు రావడంతో, ఆయన వ్యవహార శైలి ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా ఉందని భావించిన నిమ్మగడ్డ ఆయనను విధుల నుంచి తొలగించారు.