కాంగ్రెస్ కు ఝ‌ల‌కిస్తున్న సీత‌క్క‌!

Friday, June 7th, 2019, 11:30:53 PM IST

ములుగు ఎమ్మెల్యే సీత‌క్క అలియాస్ ద‌న‌స‌రి అన‌సూయ కాంగ్రెస్ పార్టీకి ఝ‌ల‌కివ్వ‌బోతోందా?. నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల కోరిక మేర‌కు కాంగ్రెస్ ను వీడి తెరాస తీర్థం పుచ్చుకోనుందా అంటే క్షేత్ర‌స్థాయి నేత‌లు అవున‌నే స‌మాధానం చెబుతున్నారు. సీత‌క్క క‌ద‌లిక‌లు కూడా ఆ మాట‌ల్ని నిజం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి స‌హ‌కారంతో టీడీపీలో ఎమ్మెల్యేగా ఓ వెలుగు వెలిగిన ద‌న‌స‌రి అన‌సూయ అలియాస్ సీత‌క్క ఆ త‌రువాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల కార‌ణంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేర‌డంతో త‌న‌తో పాటు సీత‌క్క కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో రేవంత్ ప‌ట్టుప‌ట్ట‌డం వ‌ల్లే ములుగు ఎమ్మెల్యే స్థానాన్ని ద‌క్కించుకుని తెరాస హ‌వా వున్నా స్థానికంగా వున్న బ‌లంతో గెలుపొందింది.

అయితే గ‌త నెల రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల కార‌ణంగా ఎక్కువ కాలం కాంగ్రెస్ లో కొన‌సాగ‌డం ఇష్టం లేక నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు, నేత‌ల ఒత్తిడి మేర‌కు తెరాస తీర్థం పుచ్చుకోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ నుంచి పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి తెరాస త‌రుపున ఎమ్మెల్సీగా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ద్వారా తెరాస అధినాయ‌క‌త్వం వ‌ద్ద‌కు వెళ్లి త‌న చేరిక‌కు మార్తం సుగ‌మం చేసుకునే ప‌నిలో సీత‌క్క ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వ‌ర‌లో కేటీఆర్‌తో ఆమె భేటీ కానున్న‌ట్లు స్థానిక నేత‌లు చెబుతున్నారు. ఇదిలా వుంటే ఆమె తెరాస‌లో చేరిక‌పై మ‌రో వాద‌న వినిపిస్తోంది. కాంగ్రెస్‌ను వీడి సీత‌క్క తెరాస‌లో చేర‌ద‌ని, కాంగ్రెస్‌లోనే వుంటార‌ని ఓ వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. తెరాస‌లో చేరే ముందు భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి వ‌ర్గం కూడా ఇలాగే ప్ర‌చారం చేసింది.