అలనాటి అందాల సినీతార కృష్ణకుమారి కన్నుమూత

Wednesday, January 24th, 2018, 10:55:16 AM IST

1951లో నవ్వితే నవరత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా అలనాటి అందాల తార కృష్ణ కుమారి కన్ను మూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె బెంగుళూరులోని ఆమె నివాసం వద్ద ఈ ఉదయం తుది శ్వాసను విడిచారు. దీంతో సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో ఆమె అనేక సినిమాలను చేశారు. ముఖ్యంగా తెలుగులో 110 సినిమాలకు పైగా నటించారు.

ఎన్టీఆర్ – ఏఎన్నార్ తో అలాగే అప్పటి స్టార్ హీరోలందరితో ఆమె నటించారు. షావుకారి జానకి సోదరి కృష్ణ కుమారి. అందాల తారలుగా ఎదిగిన వీరు గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు. అయితే ఊహించని విధంగా కృష్ణ కుమారి కన్ను మూయడంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు కోరుకున్నారు. భార్యాభర్తలు, కులగోత్రాలు, గుడిగంటలు, వాగ్దానం, పిచ్చిపుల్లయ్య, బంగారుపాప, వీరకంకణం, డాక్టర్ చక్రవర్తి, ఉమ్మడి కుటుంబం, తిక్క శంకరయ్య, చిలకాగోరింక, శ్రీకృష్ణావతారం వంటి హిట్ సినిమాల్లో ఆమె నటించారు.