వైఎస్ వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐపీఎస్.. సీబీఐకి లేఖ..!

Friday, April 16th, 2021, 06:39:45 PM IST

ఏపీలో సంచలన సృష్టించిన మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే హత్య జరిగి రెండేళ్లు గడిచిన నిందితులు ఎవరన్నది ఇంకా తేలలేదు. ఈ నేపధ్యంలో ఈ హత్య కేసుకు సంబంధించి ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ కేసు దర్యాప్తుపై సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నించారని లేఖలో ప్రస్తావించారు.

అయితే సీబీఐ విచారణ మొదలై ఏడాది గడచినా పురోగతి లేదని, ఈ కేసుకు సంబంధించి తన దగ్గర సమాచారముందని సీబీఐకి రెండుసార్లు లేఖ రాసినట్లు తెలిపారు. అలాగే దర్యాప్తు అధికారి ఏన్.ఎం సింగ్ కు ఫోన్ చేసినా స్పందన లేదని లేఖ ద్వారా తెలిపారు. వివేకా హత్య తర్వాత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేదాకా ఘటనాస్థలాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన బంధువులు తమ అధీనంలో ఉంచుకున్నారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆ సమయంలో మీడియాను, ఇంటెలిజెన్స్ సిబ్బందిని అనుమతించలేదని, మొత్తం సమాచారాన్ని నిఘా విభాగం అప్పటి దర్యాప్తు బృందానికి అందజేశారని తెలిపారు. అయితే వివేకా హత్య జరిగిన సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు సీబీఐకి లేఖ రాయడం చర్చనీయాంశమైంది.