మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణలు.. సీఎం కేసీఆర్ సీరియస్..!

Friday, April 30th, 2021, 10:00:51 PM IST

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలోని తమ భూములను మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమున హ్యాచరిస్ కోసం లాక్కున్నారని స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు నేరుగా లేఖ ద్వారా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమకు కేటాయించిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని, దానిపై ప్రశ్నిస్తే తమపై ఈటల అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై అన్ని మీడియా ఛానళ్లలో కథనాలు రావడంతో ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.

అయితే ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. నిజనిజాలు తేల్చాలని విజిలెన్స్ డీజీకి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. సత్వరమే దీనిపై ప్రాథమిక నివేదిక అందచేయాలని అధికారులను కోరారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా టీఆర్ఎస్‌ అధినాయకత్వంపై ఈటల తిరుగుబాటు స్వరం వినిపిస్తున్న వేళ ఆయనపై ఈ భూ కబ్జా వ్యవహారం తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.