టాప్ స్టోరి : `సెప్టెంబ‌ర్‌` అక్కినేనీస్ క్లీన్‌స్వీప్‌?!

Monday, September 24th, 2018, 02:31:27 PM IST

సెప్టెంబ‌ర్ మాసాన్ని అక్కినేనీస్ జ‌మేసుకున్నారా? అంటే అవున‌నే కింగ్ నాగార్జున క‌న్ఫామ్ చేసేశారు. ఈనెల 27న `దేవ‌దాస్` రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో నాగార్జున పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ఇంట‌ర్వ్యూ క‌న్‌క్లూజ‌న్ ఇస్తూ.. నాగార్జున ఓ మాట‌న్నారు. ఈ నెలంతా మా అక్కినేని ఫ్యామిలీదేనంటూ ఖాతాలో వేసేసుకున్నారు. ప్ర‌స్తుతం దీనిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

వాస్త‌వానికి నాగ‌చైత‌న్య `శైల‌జారెడ్డి అల్లుడు` విష‌యంలో క్రిటిక్స్ పెద‌వి విరిచేశారు. అయితే వ‌సూళ్ల ప‌రంగా ఫ‌ర్వాలేద‌నిపించింది. తొలి వారంలోనే 75 శాతం రిక‌వ‌రీ సాధ్య‌మైంద‌ని ట్రేడ్ ప్ర‌క‌టించింది. అలానే స‌మంత అక్కినేని న‌టించిన `యుట‌ర్న్` ఓపెనింగులు లేక‌పోయినా, నెమ్మ‌దిగా పిక‌ప్ అయ్యింది. ఈ విష‌యాన్ని య‌థాత‌థంగా నాగార్జున అంగీక‌రించారు. ఈ రెండు సినిమాల ఫ‌లితం ఫ‌ర్వాలేద‌ని ఆయ‌న డిక్లేర్ చేసేశారు. చైత‌న్య సినిమాను మీరే విమ‌ర్శించార‌ని అన్నారు. అంతేకాదు.. ఇదే నెల‌లో నాన్న‌గారి జ‌యంతి (సెప్టెంబ‌ర్ 20) రోజున రిలీజైన సుమంత్ – ఏఎన్నార్ లుక్‌కి ఇండ‌స్ట్రీ స‌హా అంద‌రి నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. వీట‌న్నిటినీ మించి అక్కినేని అఖిల్ న‌టిస్తున్న `మిస్ట‌ర్ మ‌జ్ను` టీజ‌ర్ యూత్‌కి ఎక్కేసింద‌ని, టీజ‌ర్‌ని మెరిపించాడ‌ని కితాబిచ్చేశారు నాగార్జున‌. కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని, చ‌క్క‌ని విజువ‌ల్స్ ని ఇచ్చాడ‌ని పొగిడేశారు. ఇక త‌న‌వంతు బ్యాలెన్స్ ఉంది. ఈనెల 27 దేవ‌దాస్ రిలీజై హిట్ కొడుతుంద‌ని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అలా మొత్తం సెప్టెంబ‌ర్‌ని అక్కినేని ఖాతాలో జ‌మేసుకున్నామ‌ని తేల్చి చెప్పారు.