సీక్వెల్ పేరుతో అంతా మోస‌మేనా?

Saturday, October 21st, 2017, 01:00:10 AM IST

సీక్వెల్ కార్డ్‌.. ఇదంతా మోస‌మేనా? కేవ‌లం జ‌నాల్ని న‌మ్మించేందుకు, థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు ఉప‌యోగించే ప‌దం ఇద‌ని భావించ‌వ‌చ్చా? అంటే అవున‌నే సినీవిశ్లేష‌కులు విశ్లేషిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో హిట్ సినిమాల సీక్వెల్స్ పేరుతో తీస్తున్న సినిమాల‌న్నీ అట్ట‌ర్‌ఫ్లాప్‌లు అవ్వ‌డానికి కార‌ణం కూడా ఇదేన‌ని చెబుతున్నారు. రీసెంట్ డిజాస్ట‌ర్ల‌లో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కిక్ 2 లాంటి సినిమాలు అలాంటి బ్యాడ్ రిజ‌ల్ట్ అందుకోవ‌డానికి కార‌ణం “చెప్పేది ఒక‌టి చేసేది ఇంకోటి“ అవ్వ‌డ‌మేన‌న్న‌ది ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల విశ్లేష‌ణ‌. ఆర్య త‌ర్వాత తీసిన ఆర్య 2 సైతం అస‌లు కొన‌సాగింపు క‌థ కాక‌పోవ‌డం, కేవ‌లం ఏవో కొన్ని పాత్ర‌ల‌కు మొద‌టి భాగంలోని పాత్ర‌ల ల‌క్ష‌ణాల్ని ఆపాదించి పూర్తిగా కొత్త క‌థ‌తో, కొత్త న‌టుల‌తో తెర‌కెక్కించ‌డం వ‌ల్ల ద‌క్కిన బ్యాడ్ రిజ‌ల్ట్ అని విశ్లేషిస్తున్నారు. రైట‌ర్ ట‌ర్న్‌డ్ డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ, సుకుమార్ వంటి వాళ్లే ఈ మాట‌ను అంగీక‌రిస్తున్నారు. మొద‌టి భాగం క‌థ‌తో ఏమాత్రం సంబంధం లేకుండా పార్ట్ 2ని తెర‌కెక్కిస్తున్నారు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. కేవ‌లం ఏవో కొన్ని పాత్ర‌ల పేర్ల‌ను, స్వ‌భావాల్ని మాత్ర‌మే సీక్వెల్ క‌థ‌ల్లో ఉప‌యోగించుకుంటూ మొత్తం సినిమా క‌థ‌ను న‌చ్చిన‌ట్టు రాసుకుంటున్నారు.

అంతేకాదు.. కొన్ని క‌థ‌లు ఏవేవో రాసుకుని, వాటికి అప్ప‌టికే హిట్ట‌యిన సినిమా టైటిల్‌ని వాడేస్తున్నారు. అప్ప‌ట్లో బిజినెస్‌మేన్ పార్ట్ 2 కోసం క‌థ రాసుకున్నాడు వ‌క్కంతం. కానీ టెంప‌ర్‌గా ఎన్టీఆర్‌తో తీశారు అదే సినిమా. అయితే ఎన్టీఆర్ వ‌చ్చేస‌రికి అది క‌థ కాస్తా ఏదో అయ్యింది. టెంప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డం మాట అటుంచితే.. ఒక్కోసారి ఇలాంటివి జ‌రుగుతున్నాయని రివీలైంది. ప్ర‌స్తుతం శంక‌ర్ తీస్తున్న రోబో 2 సీక్వెల్ కానేకాద‌ని శంక‌ర్ చెప్పేశాడు కాబ‌ట్టి ఫ‌ర్వాలేదు కానీ, సీక్వెల్ అంటే మ‌ళ్లీ దాని లెక్క వేరు. ఇక‌ముందు తీయ‌బోయే భార‌తీయుడు సీక్వెల్ క‌థ కూడా ప్రేక్ష‌కాభిమానుల ఊహ‌కంద‌ని విధంగా ఉంటే ఫ‌లితం ఊహించేదే. చూద్దాం.. వాట్ విల్ ఛేంజ్ ఇన్ ఫ్యూచ‌ర్‌?