నేటితో నిర్భయ ఘటనకు ఏడేళ్లు – ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా…?

Monday, December 16th, 2019, 09:54:36 AM IST

గత కొన్నేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి అత్యంత దారుణమైన నిర్భయ ఘటన జరిగి సరిగ్గా నేటికీ 7 ఏళ్ళు పూర్తయింది. ఆనాడు 2012, డిసెంబరు 16 న ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో ఒక మహిళా పై కొందరు దుండగులు అత్యంత పాశవికంగా దాడి చేసి, అత్యాచారం చేసి, చంపేశారు. కానీ ఆ ఘటన కు కారణమైనటువంటి ఆ మృగాలకు ఇప్పటికి కూడా సరైన శిక్ష పడలేదు. కాగా ఈ కేసులో నిందితులైన వారిలో ఒకరిని మైనర్ అనే కారణంగా విడిచిపెట్టగా, ఒకరు జైలులోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మన దేశ న్యాయవ్యవస్థ ప్రకారం ఇప్పటికి కూడా తన కూతురికి సరైన న్యాయం జరగలేదని నిర్భయ తల్లి ఆరోపిస్తున్నారు.

కాగా నిర్భయ ఘటన కి కారణమైన మృగాలను ఉరి తీయడానికి ప్రస్తుతానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు నిందితులను ఉరి తీసే గది, ఉరి తీయడానికి అవసరమైన తాడ్లు అన్ని సిద్ధం చేసి త్వరలోనే వారిని ఉరికంబం ఎక్కిస్తామని అధికారికంగా వెల్లడిస్తున్నప్పటికీ కూడా నిర్భయ మృతికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాత్రం కనిపించడం లేదు. కాగా నిర్భయ తల్లి మాత్రం తన కుమార్తెపై జరిగిన అకృత్యాన్ని గుర్తు చేసుకుంటూ… ‘నాకు భగవంతునిపై నమ్మకం ఉంది. అయితే నా కుమార్తె కేసులో దోషులైనవారికి నిర్దేశిత సమయంలోనే ఉరి తీయాలి. ఇది వీలైనంత త్వరగా జరగాలి. మా కుమార్తెకు న్యాయం జరిగేంతవరకూ పోరాడుతూనే ఉంటాను. ఆడపిల్లలపై హత్యాచార ఘటనలు కేవలం ఢిల్లీలోనే కాదు దేశంలోని మిగిలిన రాష్ట్రాలలోనూ చోటుచేసుకుంటున్నాయి. నా కుమార్తెకు న్యాయం జరగడంలో ఇప్పటికే ఎంతో ఆలస్యమయ్యింది. అయితే గడచిన ఏడేళ్లలో నేను ఏనాడూ నమ్మకాన్ని కోల్పోలేదు. దేశంలోని ఇటువంటి ఘటనలపై పోరాడుతూనే ఉంటాను. నిర్భయ ఉదంతంలో నిందితులకు త్వరలోనే ఉరి తీస్తారని నమ్ముతున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.