అభిమానికి క్యాన్స‌ర్‌.. ప‌రామ‌ర్శ‌కు బాద్‌షా!

Sunday, October 22nd, 2017, 10:58:08 AM IST

అభిమాని క‌ష్టంలో ఉంటే ఆదుకునేందుకు మంచి మ‌న‌సుతో ముందుకొస్తున్నారు మ‌న హీరోలు. అనారోగ్యంతో చివ‌రి రోజులు గ‌డుపుతున్న అభిమానుల చిట్ట‌చివ‌రి కోరిక‌ను మ‌న్నిస్తున్నారు. ఫ‌లానా హీరోని క‌లుసుకోవాల‌ని ఉంది! అన్న కోరిక‌ను వెలిబుచ్చితే, అందుకు సిద్ధ‌మై, ఎంతో ఉదారంగా త‌మ విలువైన స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నారు. మంచి మ‌న‌సుతో మాన‌వ‌త్వం ఇంకా అంత‌రించిపోలేద‌ని నిరూపిస్తున్నారు. అదే కోవ‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ చివ‌రి ఘ‌ట్టంలో ఉన్న త‌న అభిమానిని క‌లుసుకునేందుకు ముందుకొచ్చారు.

కేన్స‌ర్ మూడో ద‌శ‌కు చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న అరుణ పి.కె అనే అభిమాని కోరిక మేర‌కు త‌న‌ని క‌లిసేందుకు షారూక్ అంగీక‌రించారు. ముందుగా కేన్స‌ర్ నుంచి అరుణ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని సోష‌ల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా తెలిపారు. త‌న స్నేహితులు, బంధుమిత్రులు అనారోగ్యం నుంచి మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నార‌ని అన్నారు. “అనారోగ్యంతో పోరాడేంత శ‌క్తి నీకు ఉంది. మీ పిల్ల‌లు అక్ష‌త్‌, ప్రియాంకల ప్రేమాభిమానాలు మీ వెంట ఉన్నాయి. మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని వారు కోరుకుంటున్నారు. ఆ పిల్ల‌ల ప్రార్థ‌న నెర‌వేరుతుంది“ అని షారూక్ గుండె ధైర్యాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. డాక్ట‌ర్లు అనుమ‌తినిచ్చాక తాను ఫోన్‌లో మాట్లాడుతాన‌ని, త్వ‌ర‌లోనే నేరుగా క‌లుసుకుంటాన‌ని షారూక్ మాటిచ్చారు.