వెండితెర‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవితం?

Tuesday, March 6th, 2018, 08:55:28 PM IST

భార‌త‌దేశ ప్రధాని న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ తెర‌కెక్క‌నుందా? అంటే అవున‌నే స‌మాచారం. మోదీ పాత్ర‌లో మేటి క‌థానాయ‌కుడు శ‌త్రుఘ్న సిన్హా న‌టిస్తార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు సిన్హా స్వ‌యంగా ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌డం
సంచ‌ల‌న‌మైంది. స‌రిగ్గా కొద్ది వారాల క్రితం అమెరికాలో జ‌రిగిన ఓ స‌న్మాన కార్య‌క్ర‌మం ఈ ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌న‌కు కార‌ణ‌మైంది. వ‌చ్చే ఏడాది సినిమాని ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. ఇదివ‌ర‌కూ బ్రిటీష్ లేబ‌ర్ పార్టీ నాయ‌కుడు, ఎంపీ కీత్ వాజ్ లండ‌న్‌లో శ‌త్రుఘ్న సిన్హాని స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో సిన్హాకి ఓ ఆస‌క్తిక‌ర‌ ప్ర‌శ్న ఎదురైంది. ఒక‌వేళ మీరు ఓ మ‌హామ‌హుని జీవితంలో న‌టించాల్సి వ‌స్తే ఎవ‌రి పాత్ర‌లో న‌టిస్తారు? అని అడిగిన వెంట‌నే సిన్హా ఇచ్చిన స‌మాధానం.. ఆస‌క్తి రేకెత్తించింది. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాత్ర‌లో న‌టిస్తాన‌ని అన్నారుట‌. మోస్ట్ డైన‌మిక్ యాక్ష‌న్ హీరో అని ఆయ‌న‌ను పిలుస్తాను. ఆయ‌న‌లా న‌టించ‌మంటే అవ‌కాశం వ‌దులుకుంటానా? అని అన్నారు. ఆ క్ర‌మంలోనే కార్య‌క్ర‌మంలో ఉన్న ఇండో-బ్రిటీష్ ప్రొడ‌క్షన్స్‌లో సీత‌ల్ త‌ల్వార్ ఈ బ‌యోపిక్‌కి స‌న్నాహాలు మొద‌లెట్టారు. స‌ద‌రు సీత‌ల్ భార్య‌ భావ‌న త‌ల్వార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేందుకు రెడీ అవుతున్నారు. భావ‌న త‌ల్వార్ ఇదివ‌ర‌కూ `ధ‌ర్మ్` అనే చిత్రం తెర‌కెక్కించారు. 2008లో రిలీజైన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.