భవిష్యత్తులో కూడా నా ఆట ఇలానే ఉంటుంది : ధావన్

Tuesday, April 10th, 2018, 05:49:42 PM IST

టెస్ట్ మ్యాచ్ లో ఎంత స్లోగా ఆడితే అంత పేరొస్తుంది. వన్డేలో పరిస్థితిని బట్టి బ్యాట్ కు పని చెప్పాలి. కానీ టీ20 ఫార్మాట్ లో మాత్రం నిలకడగా ఉంటూనే బౌండరీలు బాదాలి. ఒక్క బంతి కూడా వృధా చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మరో బంతిని సిక్స్ కొట్టాలి. ప్రస్తుతం ప్రతి జట్టు కూడా ఐపీఎల్ లో ఇదే ఫార్ములాను ఉపయోగిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్లు బాగా ఆడితేనే గెలుపుపై పట్టు దొరుకుతుంది. ప్రతి టీమ్ లో ఓపెనర్లు స్పీడ్ గా ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదే తరహాలో మన సన్ రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా దూకుడుగా ఆడుతున్నాడు.

నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ధావన్ 57 బంతుల్లో 77 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ గెలిచే వరకు ఔటవ్వకుండా అభిమానులను తన షాట్స్ తో ఆకట్టుకున్నాడు. ఇకపోతే తన ఆట గురించి మాట్లాడుతూ.. బ్యాటింగ్ కు దిగినప్పుడు ‘క్రీజులో వీలైనంత వరకు ఎక్కువ సమయం ఉండాలి. అలాగే ఉన్నంత వరకు జాగ్రత్తగా ఎక్కువ పరుగులను రాబట్టాలి. అలా చేస్తే జట్టుతో పాటు నాకు కూడా లాభమే. మొన్నటి వరకు జరిగిన టూర్ లలో నా ఆటతీరులో దూకుడును పెంచాను. దక్షిణాఫ్రికా – శ్రీలంక టూర్లలో అలానే ఆడాను. భవిష్యత్తులో కూడా స్పీడ్ గా ఆడటమే నా టార్గెట్. ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టు చాలా బలంగా ఉంది. మిగతా మ్యాచ్ లలో కూడా మంచి విజయాన్ని సాధిస్తామని ధావన్ ధీమా వ్యక్తం చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments