రంగంలోకి ‘లవ్ త్రిశూల్’ టీమ్..!

Wednesday, September 10th, 2014, 12:45:01 PM IST


ఇటీవల యూపీలో పెను దుమారంరేపుతున్న ‘లవ్ జిహాద్’కు ధీటుగా శివసేన పార్టీ ‘లవ్ త్రిశూల్’ను ఏర్పాటు చేస్తోంది. ‘లవ్ త్రిశూల్’ టీమ్ లను ఏర్పాటు చేసి రంగంలోకి దింపాలని శివసేన కసరత్తులు చేస్తోంది. ‘లవ్ త్రిశూల్’లో భాగంగా కొన్ని టీమ్ లను ఏర్పాటు చేస్తారు. ఎవరైనా ‘లవ్ జిహాద్’లో భాగంగా హిందూ అమ్మాయిలను మభ్యపెట్టినట్టు తెలియడమే ఆలస్యం ఈ ‘లవ్ త్రిశూల్’ బ్యాచ్ రంగంలోకి దిగుతుంది.

ముందుగా ‘లవ్ త్రిశూల్’ ను బరేలీలో ప్రారంభిస్తామని, అనంతరం, దాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని శివసేన పార్టీ యూపీ విభాగం అధ్యక్షుడు అనిల్ సింగ్ ప్రకటించారు. ప్రేమ వల, మత మార్పిడి నుంచి హిందూ అమ్మాయిలను రక్షించడమే తమ ధ్యేయమని ఆయన చెప్పారు. హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు ఈ ప్రయోగం బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని శివ సైనికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల యూపీతో పాటు పలు ప్రాంతాల్లో, లవ్ జిహాద్ పేరు ఇటీవల మార్మోగిపోతుండడం పట్ల సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ మాట్లాడుతూ, ‘లవ్’ ‘జిహాద్’ అనేవి పవిత్రమైన పదాలని, వాటిని అపవిత్రం చేయరాదని అన్నారు. ఆ రెండు పదాలను ఉపయోగించి వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నించేవారిని చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు.