షాకింగ్ : అమితాబ్ భార్య ఆస్తి ఈ రేంజ్ లో ఉందా??

Tuesday, March 13th, 2018, 05:38:06 PM IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తెలియనివారుండరు. గత కొంతకాలంగా అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నా కూడా ఆయన ఆర్థికంగా కొంతవరకు నష్టాలు చవి చూసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒకింత సినిమాల జోరు పెంచిన ఆయన తన రుణ సమస్యలను అధిగమించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ విషయం పక్కనపెడితే ప్రస్తుతం ఆయన భార్య రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ తన ఆస్తుల వివరాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాది పార్టీ తరఫున ఎంపీగా రాజ్యసభ బరిలో దిగనున్న ఆమె నామినేషన్లో తన ఆస్తివివరాల్ని వెల్లడించి అందరూ అవాక్కు అయ్యేలా చేశారు.

ఎందుకలా అంటే ఆమె తన ఆస్తి విలువను రూ. 1,000 కోట్లుగా చూపించారు. తన భర్త అమితాబ్ తో కలిసి తమ వద్ద రూ.62 కోట్ల విలువైన బంగారం ఉందని ఆమె వెల్లడించారు. అంతేకాదు తాను వెల్లడించిన రూ. 1,000 కోట్ల ఆస్తులకు సంబంధించిన లెక్కల్ని సైతం ఆమె చూపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2012లో రాజ్యసభకు నామినేషన్ వేసిన సందర్భంగా జయాబచ్చన్ తన ఆస్తుల్ని రూ.493 కోట్లుగా చూపించైనా ఆమె ఆస్తి ఐదేళ్ల వ్యవధిలో రెట్టింపు కావటం గమనార్హం. ప్రకటించిన ఆస్తి లెక్కల ప్రకారం ఆమె రాజ్యసభలోనే అత్యంత సంపన్నురాలిగా నిలిచినట్లు తెలుస్తోంది. ఇక ఆమె వెల్లడించిన ఆస్తుల వివరాలు చూస్తే…..

బంగారం రూ.62 కోట్లు, రూ.15 కోట్లు విలువ చేసే 11 కార్లు, రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, ఒక ఫోర్డ్, రేంజ్ రోవర్, టాటా నానోతో పాటు ఒక ట్రాక్టర్, అలానే ఫ్రాన్స్ లోని బ్రిగ్నోగాన్ ప్లేగ్ లో 3175 చదరపు గజాల విస్తీర్ణంలో భవనం, నొయిడా, భోపాల్, ఫూణే, అహ్మదాబాద్, గాంధీనగర్ లలో ఆస్తులు. అలానే రూ.9 లక్షల విలువైన పెన్ను అమితాబ్ దగ్గరుందని, తనకు లక్నోలోని కేరీలో రూ.2.2 కోట్ల విలువైన, 1.22 హెక్టార్ల వ్యవసాయ భూమి. అమితాబ్ కు బరాబంకీ జిల్లా దౌల్తాపూర్ లో రూ.5.7 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమి వుందని ఆమె వివరాలతో సహా వెల్లడించారు. అయితే జయ చెప్పిన ఈ ఆస్తుల వివరాలు విన్న పలువురు ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు…..