షాకింగ్ న్యూస్ : నేను జైలుకి కూడా వెళ్లి వచ్చానంటున్న ఫేమస్ బాలీవుడ్ హీరో

Friday, March 16th, 2018, 05:42:13 PM IST

బాలీవుడ్‌ నటుల్లో కొందరు పలు కేసుల్లో చిక్కుకొని జైలుకు వెళ్లారున్నారు. అటువంటి వారిలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ వంటి నటులు గురించి మనకు తెలుసు. ఆశ్చర్యం ఏమిటంటే వివాదాలకు దూరంగా ఉండే అజయ్‌ దేవగన్ కూడా రెండు సార్లు జైలుకెళ్లారట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అజయ్‌ 18 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చారు. ఆయన నటించిన తొలి చిత్రం ఫూల్‌ ఔర్‌ కాంటే. ఆ వయసులో తనకి సరదాగా స్నేహితులతో గడపాలని ఉండేదితప్ప సినిమాల్లోకి రావడం ఏ మాత్రం ఇష్టంలేదట. అయినప్పటికీ తన తండ్రి బలవంతంగా తనను మొదటి సినిమాకు ఒప్పించినట్లు అజయ్‌ తెలిపారు.

అంతేకాదు ఆ కుర్ర వయసులో అజయ్‌ గూండాలా ప్రవర్తిస్తూ తన స్నేహితులతో ఓ గ్యాంగ్‌ నడిపేవారట. ఓసారి తన తండ్రి వీరూ దేవగన్ వద్ద ఉన్న గన్ను తీసుకుని తన స్నేహితులతో కలిసి వీధుల్లో వీరంగం సృష్టించానని దాంతో పోలీసులు తనపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టారని అన్నారు. అయితే ఆ తర్వాత తన తండ్రి వచ్చి విడిపించారని చెప్పారు. ఇలాంటి వేరొక ఘటనలో కూడా మరోసారి జైలుకెళ్లానని చెప్పుకొచ్చారు. ఆయన ప్రస్తుతం కథానాయకుడిగా నటించిన రెయిడ్‌ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అజయ్‌ ఐటీ అధికారి పాత్రలో నటించారు. పన్నులు ఎగ్గొడుతూ అక్రమాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని జైల్లో పెడుతుంటారు.

ఈ సందర్భంగా తానూ అరెస్టయ్యానంటూ చిన్ననాటి విషయాలను మీడియాతో పంచుకున్నారు అజయ్. ఈ సందర్భంగా అజయ్‌ తన గురించి మరో ఆసక్తికర విషయం కూడా పంచుకున్నారు. తన అసలు పేరు అజయ్‌ కాదని, విశాల్‌ అని తెలిపారు. ఇందుకు ఓ కారణం ఉంది. 1991 సమయంలో విశాల్‌ పేరిట చాలా మంది నటులు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. వారిలో ప్రముఖ నటుడు మనోజ్‌ కుమార్‌ తనయుడు కూడా ఉన్నారు. అతని పేరు కూడా విశాలే‌. దాంతో అందరూ కన్‌ఫ్యూజ్‌ అయ్యేవారని, అయితే ఆ పరిస్థితుల్లో చేసేదేంలేక నా పేరును అజయ్‌గా మార్చుకోవలసివచ్చింది అని చెప్పుకొచ్చారు అజయ్‌…