ఎన్నికల ఖర్చు 60,000 కోట్లా !

Tuesday, June 4th, 2019, 03:12:35 PM IST

గత మూడు నెలలు దేశంలో ఎన్నికల పండుగ జరిగింది. 542 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థులు హోరాహొరీగా తలపడ్డారు. వేల కోట్ల ధనం చేతులు మారింది. ఈ ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ తగలక మానదు. ఇంతకీ ఆ మొత్తం ఎంతంటారా అక్షారాల 60 వేల కోట్లు. ఇది 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల కంటే ఎక్కువే.

అవును.. డిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ ఈ లెక్కల్ని బయటపెట్టింది. 60వేల కోట్లు అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 100 కోట్లు. ఈ మొత్తంలో ఎన్నికల కమీషన్ ఖర్చు చేసింది 20 శాతం వరకు మాత్రమే. మిగతా మొత్తం అభ్యర్థులు, పార్టీలు ఖర్చు చేసిందే. దీన్నిబట్టి ఈ ఎన్నికల ఫలితాల్ని ధనం ఏ మేరకు శాసించిందో స్పష్టంగా తెలుస్తోంది.

ఇప్పుడే ఇలా ఉంటే 2024లో ఈ మొత్తం లక్ష కోట్లను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్కసారి మన ఖర్చుని అమెరికన్ కరెన్సీలోకి మారిస్తే అది 8.7 బిలియన్ డాలర్లగా ఉంది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఖర్చైన 6.5 బిలియన్ డాలర్ల కంటే ఇది ఎక్కువే. దీన్నిబట్టి ఇతర దేశాలతో పోలిస్తే మనం ఏ అంశంలో పేద దేశంగా ఉన్నా ఎన్నికల నిర్వహణలో మాత్రం అగ్రగామిగా ఉన్నామని అర్థమవుతోంది.