ఐపీఎల్ చైర్మన్ పదవికి శుక్లా రాజీనామా..!

Sunday, June 2nd, 2013, 02:10:08 AM IST

‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’లో చెలరేగిన వివాదానికి బడా వికెట్లు పడుతున్నాయి. ఐపీఎల్ చైర్మన్ పదవికి రాజీవ్ శుక్లా రాజీనామా చేశారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం నేపథ్యంలో ఆయన తన పదవిని వదులుకున్నారు. రాజీవ్ శుక్లా ఐపియల్ చైర్మన్‌గా గత రెండేళ్ల నుంచి కొనసాగుతున్నారు. మరో సారి ఆ పదవిలో కొనసాగాలని అనుకోవడం లేదని శుక్లా స్పష్టం చేశారు. తాను పదవులు కోసం వెంపర్లాడడం లేదని, తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా పూర్తి చేశాననే తృప్తి ఉందని రాజీవ్ తెలిపాడు.

ఆటలో ఫిక్సింగ్‌ను అరికట్టడానికి పోలీసులు, అవినీతి నిరోధక విభాగం కలిసి పనిచేయాలని, టోర్నీ ఆద్యంతం బిసిసిఐకి చెందిన అవినీతి నిరోధక అధికారి జట్టుతో ఉండాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన మూడు సూచనలు చేశాడు. బిసిసిఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ తన అల్లుడు గురునాథ్‌పై చేపట్టిన విచారణ పూర్తయ్యేవరకూ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని, విచారణ బృందం కూడా ఎవరి ఒత్తిడి లేకుండా పనిచేయాలని శుక్లా అన్నాడు. తనకు మ్యాచ్ ఫిక్సింగ్ విషయం తెలిసి ఉంటే అప్పుడే దాని అంతు చూసి ఉండేవాడినని అన్నారు.

శ్రీనివాసన్ రాజీనామాకు కౌంట్ డౌన్..
మరోవైపు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ కూడా రాజీనామా చేయాలని అన్నివైపుల నుంచి డిమాండ్ వస్తోంది. ఆయన రాజీనామాకు కౌంట్ డౌన్ మొదలైంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో అరెస్టైన తన అల్లుడు గురునాథ్ వ్యవహారం శ్రీనివాసన్ సీటుకే ఎసరు తెచ్చింది. బీసీసీఐ బాస్ దిగిపోవాలంటూ రోజురోజుకు ఒత్తిడులు పెరిగిపోతున్నాయి. తాజాగా బీసీసీఐ ఉపాధ్యాక్షులు శ్రీనివాసన్ కు అల్టిమేటం జారీ చేయడంతో అతడు రిజైన్ చేయక తప్పదనిపిస్తోంది. మరోవైపు బీసీసీఐ ఆదివారం నాడు అత్యవసరంగా సమావేశమవనుంది. మొదట జూన్ 8న ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటుందని ప్రకటించిన బీసీసీఐ …ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో అర్జెంటుగా సమావేశమవాలని నిర్ణయించుకుంది. శ్రీనివాసన్ రాజీనామా చేయాలనే వారి సంఖ్య క్షణక్షణానికి పెరిగిపోతుండడంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.