బొమ్మరిల్లు వదిలేసిన సిద్దార్థా..నీ గృహానికి తక్కువైంది అదే..!

Wednesday, October 25th, 2017, 03:07:10 PM IST

ఒకప్పుడు హీరో సిద్దార్థ్ కు అటు యూత్ లో మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండేది. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి మరపురాని విజయాలు సిద్దార్థ్ కెరీర్ లో ఉన్నాయి. స్టార్ హీరో హోదాకు దరిదాపుల్లోకి వచ్చిన సిద్దార్థ్ ఆ క్రేజ్ మొత్తం పోగొట్టుకున్నాడు. సరైన ప్రణాళిక లేకపోవడం వలనే ఇలా జరిగింది. నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరో గా ఉన్న సిద్ధార్థ్ ఇప్పుడు సాధారణ హీరో అన్న ఇమేజ్ కూడా లేదు. తెలుగు ప్రేక్షకులైతే దాదాపుగా సిద్దార్థ్ ని మరచిపోయారు. ఈ తరుణంలో సిద్దార్థ్ నటించిన కొత్త చిత్రం ‘గృహం’. హర్రర్ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రం గురించి బజ్ ఎక్కడా లేదు.

సరైన ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండా సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి నవంబర్ 3 చిత్ర రిలీజ్ అంటూ ప్రకటించేశారు. సిద్ధార్థ్ క్రేజ్ గతంలో మాదిరిగా లేదు. కాబట్టి కొత్తసినిమా రిలీజ్ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా ప్రమోషన్ కార్యక్రమాలు ఉండాలి. కానీ అవేవి లేకుండా సడన్ గా సినిమా రిలీజ్ అంటే నిర్మాతకులు ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గృహం చిత్రానికి సిద్ధార్థ్ కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. సిద్దార్థ్ క్రేజ్ పడిపోయినా అతడి ఓన్ స్టయిల్ లో ఉండే యాక్టింగ్ కు తెలుగులో చాలా మంది అభిమానులు ఉన్నారు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాల్లో చలాకి కుర్రాడిగా సిద్ధార్థ్ నటన ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది.

కాగా గృహం విడుదలవుతున్న రోజే ఆది నటించిన నెక్స్ట్ నువ్వే, రాజశేఖర్ పి ఎస్ వి గరుడ వేగ వంటి చిన్నా చితక చిత్రాలు విడుదలవుతున్నాయి. యంగ్ హీరో ఆది ఉన్న క్రేజ్ అంతత మాత్రమే. ఇక సీనియర్ హీరో రాజశేఖర్ గరుడ వేగ అంటూ రాబోతున్నాడు. వాళ్లందరితో పోల్చుకుంటే సగటు అభిమాని సిద్దార్థ్ సినిమాకే ఓటు వేసే అవకాశాలు ఉన్నాయ్. కానీ ఎలాంటి బజ్ లేకుండా, ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా హడావిడిగా సినిమాని విడుదల చేయడం ద్వారా ఆ అవకాశాల్ని కోల్పోయినట్లు అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. సిద్దార్థ్ తన పూర్వ వైభవాన్ని పొందాలి అనుకుంటే ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించాలి మరి.